ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. రాజకీయ ప్రత్యర్థులు ప్రజల్లో తిరిగి బలం పుంజుకోకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లిపోతే.. తనకు ఎడ్వాంటేజీ అవుతుందనేది ఆయన వ్యూహం. అదే సమయంలో, తమ ప్రభుత్వం విపరీతంగా అత్యద్భుతమైన సంక్షేమ పథకాలు చేపడుతున్నదని టముకు వేసుకుంటూ.. ముందస్తుకు వెళితే పరువు పోతుందనేది ఆయనలోని భయం. ఒకవైపు మరో ముప్పయ్యేళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను మీ అందరికీ సేవ చేసుకుంటాను అని చెప్పుకుంటూ.. అయిదేళ్లు కూడా పూర్తిగా పదవిలో ఉండలేకుండా ముందస్తుకు వెళితే తన వైఫల్యాన్ని ప్రజలు గుర్తిస్తారని జగన్ కు భయం. ఇలాంటి సందిగ్ధావస్థలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే కోరిక ఎంత ఉన్నా.. ప్రతిపక్షాలు ఆల్రెడీ ఆ మాటను ప్రజల్లోకి తీసుకువెళ్లిన నేపథ్యంలో.. ముందస్తు లేదని నమ్మించడానికి ఆయన నానా పాట్లు పడుతున్నారు.
తాజాగా కొన్ని నియోజకవర్గాలకు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న జగన్, కార్యకర్తలతో ఇంకా 16 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, ఇప్పటినుంచే అందరూ కష్టపడి పనిచేయాలని అంటున్నారు. ప్రత్యేకించి 16 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పడం వెనుక.. ముందస్తు లేదనే సంకేతాలను ఇవ్వడమే ఆయన ప్రయారిటీగా ప్రజలు అనుకుంటున్నారు.
సీఎం జగన్ మాటలు మొత్తానికి పరస్పర విరుద్ధంగా ఉంటూ పార్టీ శ్రేణులను, నాయకులను అయోమయంలో పడేస్తున్నాయి. ఎందుకంటే.. ఒకవైపు 16 నెలల్లో ఎన్నికలు వస్తాయి అంటారు.. మరోవైపు ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్ధం కావాలి అని మార్గదర్శనం చేస్తారు. అంటే 16 నెలల సుదీర్ఘ ఎన్నికల ప్రచార ప్రయత్నాలు అంటే.. ప్రజలు చీదరించుకునేంతగా విసిగిపోతారు అనేది కార్యకర్తల భయం. అంతదూరంలో ఎన్నికలు ఉన్నప్పుడు.. ఇప్పటినుంచి ప్రచారం ఎందుకనేది కార్యకర్తల అనుమానం. ఇప్పుడు ప్రజలవద్దకు వెళ్లేకొద్దీ గడపగడపకు కార్యక్రమంలో వచ్చే సమస్యలకే సమాధానం చెప్పలేక సతమతం అవుతున్నామని.. ఇంకా మరింతగా ప్రజల్లోకి వెళ్లాంటే ఇంకా ఇబ్బందులేనని వారి భయం.
అదే సమయంలో.. ప్రతి గ్రామంలోనూ 89 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయనే మాట అంటున్న జగన్.. ఎన్నికల గురించి ఎందుకు ధీమాగా ఉండలేకపోతున్నారనేది పెద్ద ప్రశ్న. ఆయన చెబుతున్న సంక్షేమమే గనుక నిజమైతే.. ప్రజలు ఎగబడి ఓట్లు వేయాలి. ప్రచారం గురించి కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం నిమ్మళంగా ఉండాలి. కానీ ఆయన అలా ఉండరు. వచ్చే వారం ఎన్నికలు జరుగుతున్నంతగా నాయకుల్ని వెంటపడుతూ.. ప్రజల్లోకి వెళ్లాలని శాసిస్తారు.
ఈ వైఖరి కార్యకర్తల్లో కూడా అయోమయం సృష్టిస్తోంది.జగన్ ముందస్తు వ్యూహాన్ని పసిగట్టి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ తమ పార్టీలను అప్రమత్తం చేయడంతో.. ముందస్తు రావడం లేదని నమ్మించడానికి ఇప్పుడు జగన్ నానా కష్టాలు పడుతున్నట్టుంది.