ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఒత్తిడుల రీత్యా ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారని.. ప్రతినెలా ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం దగ్గర నుంచి ప్రతి చిన్న అవసరానికి అప్పులు పుట్టించుకు రావడం అనేది ప్రభుత్వానికి అతి పెద్ద భారంగా మారుతోందని.. ప్రభుత్వం విఫలం కాకముందే, ప్రజలు తమ చేతకానితనాన్ని గుర్తించక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్ అనుకుంటున్నారని కొన్నాళ్లుగా ఒక ప్రచారం జరుగుతోంది. అప్పులు పుట్టే మార్గాలన్నీ మూసుకుపోతుండడంతో, ప్రజలు వాస్తవాలు గ్రహించక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే పాలక పక్షంలోని పెద్దలు మాత్రం ఎప్పటికప్పుడు.. తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళవలసిన అవసరంలేనేలేదని.. ప్రజలు తమకు ఐదు సంవత్సరాలు పరిపాలించడానికి అవకాశం ఇచ్చారని.. చివరి రోజు వరకు తామే పాలన సాగిస్తామని చెప్పుకుంటూ రోజుల నెట్టుకు వస్తున్నారు.
తాజాగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను గమనిస్తే.. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే కసరత్తు చేస్తున్న అనే అభిప్రాయం పలువురికి కలుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి తన ప్రసంగంలో.. రాష్ట్రంలో ఏ క్షణంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చినా సరే ఎదుర్కొనేందుకు తేల్చి చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రస్తావన లేకుండా బహిరంగ సభలో ఈ మాట చెప్పడం అనేది అనేక ఊహలకు ఆస్కారం కల్పిస్తోంది.
తాము ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అనే సంకేతాలను . ఈ మాటల ద్వారా సజ్జల ప్రజల్లోకి పంపినట్లుగా పలువురు భావిస్తున్నారు. నిజానికి ప్రభుత్వం దివాలా తీసినదంటూ, ముందస్తుకు వెళ్లడం తప్ప వారికి వేరే ప్రత్యామ్నాయం లేదంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చాలా కాలంగా చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరిగే లాగా జగన్ తన ప్రభుత్వాన్ని రద్దు చేస్తారనే ప్రచారం ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అయిన సందర్భంలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి అనుమతి కోరి వచ్చారంటూ ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడు సజ్జల మాటలను కూడా ముడిపెట్టి గమనిస్తే అదంతా నిజమే అనిపిస్తుంది.
నిన్నటికి నిన్న- దసరా నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోరుకుంటున్న ఒక శుభవార్త బయటకు వస్తుందని, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక సంకేతం ఇచ్చారు. ఆ సంకేతం విశాఖకు రాజధాని తరలింపునకు సంబంధించి అయి ఉంటుందని అందరూ ఊహించారు. కానీ ఆ శుభవార్త కూడా ముందస్తు ఎన్నికల గురించే అయి ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.