మాయచేసిన అమిత్ షా.. అంతా చల్లారిపోయిందే!

Tuesday, November 5, 2024

మహిళా రెజ్లర్లు చేపట్టిన దీక్ష ఎంత ఉధృతమైన స్థాయికి వెళ్లిందో అందరికీ తెలుసు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. అంతర్జాతీయంగా క్రీడాసంఘాల, సమాఖ్యల ఎదుట భారతదేశపు పరువు మొత్తం పోయింది. మహిళా రెజ్లర్లు ఇప్పటిదాకా తాము గెలిచిన పతకాలు అన్నింటినీ గంగానది పాల్జేస్తామని ఉద్యమంగా వెళ్లి, చివరి నిమిషంలో అంతటి తీవ్రమైన నిరసన తగదని కాస్త వ్యవధి ఇచ్చి వెనక్కు తగ్గారు. ఆ రకంగా.. వారి పతకాలు గంగలో కలవకుండా ఆగాయి గానీ, భారతదేశపు ప్రతిష్ఠ మాత్రం గంగలో కలిసిపోయింది. ఇంతజరిగిన తర్వాత కూడా.. వివాదాస్పద బిజెపి ఎంపీ బ్రిజ్ మోహన్ మీద ఇంకా ఎలాంటి చర్య తీసుకోకపోగా, కేంద్రహోంమంత్రి అమిత్ షా ఏం మాయ చేశారో ఏమో గానీ.. రెజ్లర్లు నెమ్మదిగా తమ ఆందోళన నుంచి వెనక్కు తగ్గుతున్నారు.
శనివారం రాత్రి రెజ్లర్లతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చట్టం ఎవరిపట్లనైనా ఒకేరీతిగా వ్యవహరిస్తుందని, బ్రిజ్ మోహన్ విషయంలోనైనా తమ పని తాను చేసుకుపోతారని ఆయన వారితో అన్నట్టుగా వార్తలు వచ్చాయి. నిజానికి ఇది కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న వారికి ఊరట కలిగించే మాట కాదు. అయితే.. వారు మాత్రం ఒక్కరొక్కరుగా తిరిగి తమ తమ ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారు. అందుకే ఇప్పుడు దేశమంతా కూడా అమిత్ షా రెజ్లర్లపై ఏం మాయ చేశారో అని అనుకుంటున్నారు.
సాక్షి మలిక్ తిరిగి తన నార్తర్న్ రైల్వే ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. మరికొందరు రెజ్లర్లు కూడా తిరిగి తమ తమ ఉద్యోగాల్లోకి వెళ్లిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి చేరికలను బట్టి. తాము పోరాటం నుంచి విరమించుకున్నట్టు కాదని వారు ప్రత్యేకంగా ట్వీట్ల ద్వారా తెలియజేయడం విశేషం. బ్రిజ్ మోహన్ కు వ్యతిరేకంగా , ఆయన మీద చార్జిషీట్ దాఖలు చేసి చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారంటున్నారు.
నిజానికి మహిళా రెజ్లర్ల సుదీర్ఘకాల ఆందోళన పట్ల కేంద్రప్రభుత్వం ఇంకా ముందుగానే స్పందించి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆరోపణలు ఎదుర్కొంటున్నది తమ సొంత పార్టీ ఎంపీ అయ్యేసరికి వారు ముందుకు వెళ్లడానికి మీనమేషాలు లెక్కించారు. ఈలోగా పార్లమెంటు కొత్తభవనం ప్రారంభోత్సవం రోజున , ఆ ప్రాంతాన్ని ముట్టడించడానికి రెజ్లర్లు వెళ్లడం.. పోలీసులు వారిపట్ల అమానుషంగా వ్యవహరించి అరెస్టులు చేయడం వంటి పరిణామాలు.. అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. దేశానికి వన్నెతెచ్చే అంతర్జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత మాత్రమే అమిత్ షా వారితో మాట్లాడి.. మొత్తానికి రచ్చ సద్దుమణిగేలా చేసినట్టు కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles