జగన్ మామయ్య ఇంకా అలకపాన్పు దిగలేదు. ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో పుట్టిన ముసలం ఇప్పుడప్పుడే చల్లబడేలా కూడా లేదు. రెండు రోజులు రాజశ్యామల యాగంలో బిజీగా గడిపిన బాలినేని శ్రీనివాసరెడ్డి , ఆ యాగం ముగిసిన వెంటనే.. తిరిగి అసంతృప్త ట్రాక్ మీదికి వచ్చారు. మార్కాపురంలో తనకు జరిగిన ఘోర పరాభవానికి తెరవెనుక ఉన్న అసలు కారకులు ఎవరు? అని ఆరాతీసే పనిలో ఉన్నారు. వారి సంగతి తేల్చుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. కొందరిమీద అనుమానాలు కూడా కలిగి ఉన్నారు. వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని కూడా అంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్కాపురం సభకు హాజరైన నేపథ్యంలో హెలిపాడ్ వద్దకు వాహనాన్ని వెళ్లనివ్వకుండా స్థానిక సీఐ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన బాలినేని, వారు ససేమిరా అనడంతో వెనక్కు తిరిగి వెళ్లిపోయారు. నిజానికి అప్పటికే ఆయన రాజశ్యామల యాగం ప్రారంభించి ఉన్నారు. యాగం ప్రారంభించిన తర్వాత.. తన సొంత జిల్లాలో జరుగుతున్న కార్యక్రమం గనుక.. తాను గైర్హాజరు అయితే వేరే సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో వచ్చారు. తీరా వచ్చాక పరాభవం జరిగింది.
ఆయన తిరిగి వెళ్లిపోయాక.. కొందరు నాయకుల్లో కదలిక వచ్చింది. సీఎంవో నుంచి ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు జరగడంతో తిరిగి సభాసమయానికి వచ్చారు. జగన్ ప్రసంగం తర్వాత.. ఈబీసీ నేస్తం అందించడంలో జగన్ తో పాటు బటన్ తాను కూడా నొక్కారు.
అయినా సరే.. తనకు జరిగిన పరాభవం అనేది అంతర్గతంగా పార్టీలో జరిగిన కుట్ర అనే అభిప్రాయంతోనే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. తాడేపల్లి స్థాయిలో పలుకుబడి ఉన్న కీలక నేత ఒకరు దీని వెనుక ఉండి.. పోలీసులు తనను పరాభవించేలా చక్రం తిప్పినట్టు ఆయన అనుమానిస్తున్నారు. తెర వెనుక ఉన్నది ఎంతటి వారైనా సరే విడిచిపెట్టేది లేదని ఆయన సన్నిహితులతో అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
నిజానికి జగన్ పార్టీలో ఆయన వెంట అత్యంత కష్టకాలంలో కూడా నిలిచిన కొద్దిమంది నాయకుల్లో బాలినేని కూడా ఒకరు. ఆయన తనను రెండోమంత్రివర్గంలో కొనసాగించలేదనే కినుక వహించి ఉన్నారు. అలాంటిది.. జగన్ కార్యక్రమానికి తనను అడ్డుకోవడం అనేది ఆయనకు పుండుమీద కారం రాసినట్టుగా తయారైన వ్యవహారం. మరి ఈ ఆగ్రహం నుంచి ఆయన ఎలా చల్లబడతారో.. జగన్ తన మామయ్య కోపాగ్నిలో పార్టీ కాలిపోకుండా ఎలా జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.
మామయ్య అలక తీరలేదు.. ఆగ్రహమే!
Friday, November 22, 2024