మామయ్య అలక ఎపిసోడ్ బాబాయి పుణ్యమే!

Friday, November 22, 2024

అధికారంలో ఉన్న పార్టీలో సహజంగానే ముఠాలు, విభేదాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికి వారు తమ మాట నెగ్గాలని అనుకుంటూ ఉంటారు. తమ పెత్తనం సాగించాలని అనుకుంటారు. నాయకులందరూ ఐక్యతతో ఉంటే పార్టీకంటె వారు బలంగా తయారవుతారనే ఉద్దేశంతో .. సాధారనంగా పార్టీ అధిష్టానం కూడా ముఠాల విషయంలో చూసీచూడనట్టు వ్యవహరిస్తూ ఉంటుంది. ఇదంతా అధికారంలో ఉన్నప్పటి సంగతి.. కానీ, అధికారంలో లేని రోజుల నుంచి కూడా ఆజన్మశత్రుత్వం వంటి ముఠాతగాదాలు పార్టీని వెన్నాడుతూ ఉంటే వాటిని ఎలా పరిగణించాలి? ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఒంగోలు రాజకీయాల్లో జరుగుతున్నది అదే! వైసీపీ అధికారంలో లేని నాటినుంచి కూడా.. వైవీ సుబ్బారెడ్డి – బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ఉన్న ముఠాతగాదాలే ముదిరి ముదిరి ఇప్పుడు బాలినేని అలకకు, పార్టీ పదవికి రాజీనామాకు దారితీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఇద్దరు నాయకులు కూడా ప్రకాశం జిల్లాలో కీలక నాయకులు. మొత్తం జిల్లాను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని తొలినుంచి ఆరాటపడుతున్నవారు. ఈ ఇద్దరూ జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువులు. వైవీసుబ్బారెడ్డి బాబాయి అవుతారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మామయ్య అవుతారు.
గత ఎన్నికల సమయానికి వైవీసుబ్బారెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంగోలు ఎంపీగా నెగ్గే అవకాశం లేదని సర్వేలు చెప్పడంతో జగన్ బాబాయిని పక్కన పెట్టారు. మామయ్య మాత్రం యథాతథంగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిపోయారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే బాబాయికి జగన్ న్యాయం చేశారు. బోర్డులో ఎవరెవరు ఉండాలో తేల్చుకోడానికి కొన్ని నెలల ముందే బాబాయిని మాత్రం టీటీడీ ఛైర్మన్ చేసేశారు. సాధారణంగా నామినేటెడ్ పోస్టుల్లో రాష్ట్రంలోనే అత్యంత విలువైనదిగా అందరూ పరిగణించే టీటీడీ ఛైర్మన్ పోస్టును వరుసగా రెండోసారి కేటాయించడం అరుదు. అయితే జగన్, బాబాయి వైవీకి రెండోసారి కూడా ఇచ్చారు. తిరుమల వ్యవహారాల్లో ఆయన హవాకు ఎదురులేదనిపించేలా చేశారు.
ఒకవైపు బాలినేనితో వైవీ వైరం అలాగే కొనసాగుతోంది. బాబాయికి పెద్దపీట వేస్తున్న సమయంలోనే మామయ్యను మంత్రిపదవినుంచి కూడా తప్పించారు. జగన్ తన పార్టీకి, భవిష్యత్తుకు ఎంతో కీలకంగా భావిస్తున్న విశాఖ ఉత్తరాంధ్రప్రాంతానికి బాబాయినే ఇన్చార్జిగా నియమించారు. అటు కీలకమైన ఉత్తరాంద్ర ఆయన చేతుల్లోనే ఉంది. టీటీడీ రూపంలో అతిపెద్ద పదవి ఉంది. ఎటూ ఒంగోలు రాజకీయాలను కెలకకుండా ఉండబోరు. అలా వైవీ ప్రాధాన్యం చాలా పెరిగింది. మరోవైపు బాలినేనికి కేబినెట్ హోదా లేకుండాపోయాక, ఒంగోలు జిల్లా పరిధిని కూడా తప్పించి.. మూడు చిన్న జిల్లాల పార్టీ ఇన్చార్జి పదవిని కట్టబెట్టారు. ఇది మొక్కుబడి పదవి అని ఎవరైనా అనగలరు.
అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత.. కులాలను ప్రాంతాలను సంతృప్తి పరచే ఉద్దేశంతో టీటీడీ బోర్డు పదవినుంచి వైవీ సుబ్బారెడ్డిని తప్పించి, ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నాయకుడికి కట్టబెడతారనే ప్రచారం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అంటే వైవీకి ప్రాబల్యం పెరుగుతూనే పోతుండగా.. బాలినేని హవాకు కోతపడుతూ వచ్చింది. దానికి తోడు తాడేపల్లి రాజకీయాలు అదనం. ఇవన్నీ వెరసి బాలినేని రాజీనామా చేశారని సమాచారం. ప్రధానంగా వైవీ తో ఉన్న శత్రుత్వం కూడా తోడవడం వల్ల.. మొగుడు కొట్టినందుకు కాకుండా తోటికోడలు నవ్వినందుకు ఏడ్చిన చందంగా.. వైవీ హవా పెరిగిపోతూన్నందుకు కూడా అలిగి ఆయన పార్టీ వ్యవహారాలకు దూరం జరుగుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles