మాచర్లలో జరిగిన విధ్వంసం, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆస్తి నష్టం, దాడులు, దాడులకు గురైన బాధితుల మీదనే పోలీసు కేసులు ఇవన్నీ.. పార్టీకి కొత్త జాగ్రత్తను నేర్పుతున్నాయి. ఇక ఎన్నికల సీజన్ వచ్చేస్తుండగా.. రాబోయే రోజుల్లో మాచర్ల తరహా విధ్వంసానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పాల్పడడానికి అధికార వైసీపీ తెగిస్తుందని చంద్రబాబునాయుడు అంచనా వేస్తున్నారు. అందుకే.. ఎలాంటి పరిణామాలు ఎదురైనా సరే.. ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
మాచర్లలో తెలుగుదేశం నాయకుల ఆస్తులనుధ్వంసం చేయడం, దహనం చేయడం, చితక్కొట్టడం వంటి దుర్మార్గాలకు వైసీపీ నాయకులు పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం కింద పట్టణంలో పాదయాత్ర చేయడానికి పూనుకున్న తెలుగుదేశం నాయకుల్ని అడ్డుకుని.. దాన్ని రాష్ట్రమంతా అవాక్కయ్యేలా అతిపెద్ద విధ్వంసకాండగా మార్చిన ఘనత వైసీపీ నాయకులది. అయితే ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టకూడదని చంద్రబాబునాయుడు డిసైడ్ అయ్యారు. మాచర్లలో తమ పార్టీ వారి మీదనే కేసులుపెట్టడానికి సంబంధించి వారికి న్యాయపరమైన అండ మొత్తం పార్టీ అందించేలా ఏర్పాటు చేస్తున్నారు.
అయితే మాచర్ల తరహా భయపెట్టే విధ్వంసకాండలు రాష్ట్రమంతా జరుగుతాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలను, శ్రేణులను భయపెట్టి.. వారు అసలు పార్టీకి దూరమయ్యేలా కుట్ర వ్యూహరచన చేస్తారనేది ఆయన అంచనా. టీడీపీ నాయకుల మీద దాడులు చేయడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, మళ్లీ ఎదురు మాట్లాడితే చాలు.. అదే పెద్ద నేరం అయినట్లుగా పోలీసు కేసులు పెట్టడం జరుగుతాయని.. వాటిని ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ నాయకులకు చెబుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ క్రియాశీల కార్యకర్తలు స్థైర్యం కోల్పోకుండా.. నాయకులు వారితో నిత్యం టచ్ లో ఉండాలని మార్గదర్శనం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా.. బలమైన న్యాయనిపుణులు, న్యాయవాదులతో ఒక టీమ్ ను ఏర్పాటుచేసుకుని సిద్ధంగా ఉండాలని, పోలీసు కేసులు వంటివి పెట్టేప్పుడు.. వారి అరాచకాల్ని ఎదుర్కోవాలని సూచిస్తున్నారు.
వైసీపీ కవ్వింపు చర్యలకు తమ పార్టీ వారు రెచ్చిపోవద్దని, ప్రతిదాడులు చేయవద్దని, అనవసరంగా ఘర్షణలను పెంచవద్దని కూడా పార్టీకి సూచిస్తున్నారు. వైసీపీ ఆగడాలు, అరాచకల్ని ప్రజలు గమనిస్తున్నారని.. వారి తీర్పులో ఆ సంగతి ప్రతిఫలిస్తుందని.. తెలుగుదేశం మీద కవ్వింపు దాడులకు దిగడం ద్వారా.. వైసీపీ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నదని కూడా ఆయన అంచనా వేస్తున్నట్లు సమాచారం. అయితే.. తెలుగుదేశం వెనక్కు తగ్గిందనే అభిప్రాయం ఏర్పడకుండా.. నియోజకవర్గాల్లో మాచర్ల తరహా దాడులు జరిగేప్పుడు వాటిని ఎదుర్కోవడానికి, వారి అరచకాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.
‘మాచర్ల’ రిపీట్ కాకుండా.. చంద్రవ్యూహం!
Sunday, December 22, 2024