ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన సొంత పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల సంగతి కూడా సాధారణంగా ఇతరులకు అప్పగిస్తూ ఉంటారు. నాయకుల మధ్య పంచాయతీ చేయడాన్ని బహుశా ఆయన తన స్థాయికి తగని పనిగా భావిస్తుంటారో ఏమో తెలియదు. సాధారణంగా వాటిలో జోక్యం చేసుకోరు. అయితే.. నెల్లూరు నగర నియోజకవర్గ వ్యవహారం ఆయన స్వయంగా పట్టించుకోవాల్సి వస్తోంది. ఒకసారి కాదు.. పదేపదే తానే పట్టించుకోవాల్సి వస్తోంది. అయినా సరే.. అక్కడి నేతల విభేదాలు సమసిపోతున్నట్టుగా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత స్థాయి వ్యక్తి బుజ్జగించినా కూడా.. విభేదాలు సమసిపోవడం లేదంటే.. అక్కడి నాయకులు మాట వినడం లేదంటే.. అది ఖచ్చితంగా జగన్ అసమర్థతే అవుతుందా? అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు ప్రస్తుతం తన సొంతవర్గం మనుషులతోనే విభేదాలు ఏర్పడ్డాయి. ఆయనకు ఆ సెగ బాగా తగులుతోంది. ఆయనకు బాబాయి వరుస అయ్యే రూప్ కుమార్ యాదవ్ తదితర నాయకులు ఇప్పుడు రెండో గ్రూపుగా తయారయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ కు అసలు పార్టీ టికెట్ రాదని వారు స్థానికంగా ప్రచారం చేస్తున్నారు. సహజంగానే నోటి దూకుడు ఎక్కువగా ఉండే అనిల్ కుమార్ యాదవ్, తన కొత్త ప్రత్యర్థుల మీద విపరీతంగా రెచ్చిపోతూ నియోజకవర్గంలో సభలు పెడుతున్నారు.
ఈ పరిణామాలన్నీ కలిసి పార్టీ పరువును సాంతం తీసేస్తున్నాయి. అయితే నెల్లూరులో బాబాయి అబ్బాయి మధ్య సయోధ్య కుదిర్చడం గురించి రకరకాల స్థాయుల్లో పాటీ అధిష్టానం ప్రయత్నించింది. అయితే వీరి తగాదాలు ఒక కొలిక్కి రాలేదు. నేరుగా జగన్ రంగంలోకి దిగి ఇరువురినీ పిలిపించి మాట్లాడారు. రాజీకుదిర్చి పంపారు. తాడేపల్లి ప్యాలెస్ దాటివచ్చిన తర్వాత.. విభేదాలు యథాతథం అయ్యాయి.
సీఎం జోక్యం చేసుకుని స్వయంగా మాట్లాడిన తర్వాత కూడా.. ఆ నాయకులు తమ విబేదాలను వదలుకోలేదంటే.. అది జగన్ వైఫల్యమే అవుతుంది కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ గతంలో అనూహ్యంగా జగన్ కు దగ్గరై ఎమ్మెల్యే అయ్యారు. అంతకంటె చిత్రంగా కీలకమైన నీటిపారుదల శాఖ మంత్రి కూడా అయ్యారు. విస్తరణ సమయంలో ఆయన పదవి పోయింది. అప్పటినుంచి అనిల్ చాలా వరకు సైలెంట్ గానే ఉంటుండగా, ఈ విభేదాలకు సంబంధించిన వార్తలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అనిల్ ను జగన్ మళ్లీ తాడేపల్లికి పిలిపించి ఆరాలు తీయాల్సి వచ్చింది. ఇన్నిసార్లు జగన్ స్వయంగా రాజీ కుదిర్చడమే ఎక్కువ అనుకుంటుండగా, ఇన్నిసార్లూ.. ఆ నేతలు పట్టించోకపోతే.. పార్టీ మీద జగన్ పట్టు తగ్గుతున్నదని అనడానికి దానికి నిదర్శనంగా భావించాలేమో అని పలువురు విశ్లేషిస్తున్నారు.