దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం, వాటి ద్వారా న్యాయపరమైన చిక్కులను కొని తెచ్చుకోవడం.. ఢిల్లీ నుంచి పెద్దపెద్ద లాయర్లను పిలిపించుకుని వారికి అధికారికంగానే కోట్లకు కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును తగలేయడం, తీరా కోర్టుతీర్పుల రూపంలో ఎదురుదెబ్బలు తిని ఊరుకోవడం .. అనేది జగన్ సర్కారుకు రివాజుగా మారిపోయింది. తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడంలో- న్యాయస్థానాల ద్వారా ఈ ప్రభుత్వానికి తగిలినన్ని ఎదురుదెబ్బలు బహుశా మరెవ్వరికీ ఎదురై ఉండకపోవచ్చు. అయినా సరే పాఠాలు నేర్వలేదన్నట్టుగా మరో ఎదురుదెబ్బ కోసం, కోర్టు ధిక్కరణ కేసు కోసం ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తోంది.
అమరావతి ప్రాంతంలో ఆర్-5 జోన్ అని పేరు పెట్టి.. ఒక వికటప్రయోగానికి జగన్మోహన్ రెడ్డి తెరతీసిన సంగతి తెలిసిందే. సీఆర్డీయే పరిధిలో సుమారు యాభై వేల మంది వివిధ ప్రాంతాలకు చెందిన పేదలకు సెంటుభూమి ఇంటిస్థలాలను ఇటీవల పంపిణీ చేశారు. తద్వారా.. బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియాల తయారీకి జగన్ సంకల్పించారనే విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. సీఆర్డీయే నిబంధనలకు విరుద్ధంగా ఒక కొత్త ఆర్ 5 జోన్ ను సృష్టించి.. ఎక్కడెక్కడివారో అయిన పేదలకు ఇలా ఇళ్లస్థలాలు పంచడం మాస్టర్ ప్లాన్ కు విరుద్ధం అంటూ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. కోర్టులో మధ్యంతర ఉత్తర్వులు రావడంతో.. ఇళ్ల పట్టాల పంపిణీ సజావుగా జరిగిపోయింది. అయితే.. ఇంటి స్థలాలమీద లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు అనేవి.. తుది తీర్పునకు లోబడే ఉంటుందని కోర్టు చాలా స్పష్టంగా పేర్కొన్నది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా పేదలకు పంపిణీ చేసిన ఇంటి పట్టాల మీద.. ప్రత్యేకంగా ‘‘కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి మాత్రమే స్థలాలపై హక్కులు ఉంటాయని’’ ప్రత్యేకంగా తయారుచేయించిన స్టాంపులు వేసి, వాటిపై తహశీల్దార్లతో సంతకాలు చేయించి ఇచ్చారు. అంటే ఆ లబ్ధిదారులంతా స్థలాలు పొందారు తప్ప ఇంకా పూర్తిస్థాయి యజమానులు కాలేదు.
ఈలోగా అ స్థలాల్లో ఇళ్లు నిర్మించడానికి కలెక్టరు సన్నాహాలు చేస్తుండడం వివాదాస్పదం అవుతోంది. జులై 8 నాటికి ఈ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించాలని కలెక్టరు అధికారులను ఆదేశిస్తున్నారు. అయితే ఈ ఇళ్ల నిర్మాణం సగంలో ఉన్నా, లేదా పూర్తయినా.. తర్వాత కోర్టు తీర్పు వీటి కేటాయింపునకు భిన్నంగా వస్తే ఏం చేస్తారు? కట్టిన ఇళ్లను కూలుస్తారా? కూల్చడం కోసమే కడుతున్నారా? లేదా, కేటాయించిన ఇళ్లను చంద్రబాబునాయుడు దళాలు పేదలకు దక్కకుండా కూల్చివేయిస్తున్నాయని విమర్శించడానికే ఈ ఎత్తుగడనా? అనేది అర్థం కావడం లేదు. నిర్మాణాలు మొదలయ్యాయి గనుక.. ఆ స్థలాలకు చట్టబద్థత రాదు. తుదితీర్పుకు ముందే నిర్మాణాలు ప్రారంభించడం నేరమే అవుతుందని అధికారులు తెలుసుకోవాలి.
మరో ‘కోర్టు ధిక్కరణ’కు సర్కారు సిద్ధమౌతోందా?
Tuesday, November 5, 2024