వైఎస్ఆర్ కాంగ్రెస్ సారథ్యంలో రాష్ట్రంలో నడుస్తున్న ప్రభుత్వం ఎంతటి మోసపూరితమైన ప్రభుత్వమో తాజా బడ్జెట్ లో మరోసారి బయటపడింది. అమరావతి నగరం విషయంలో వారెంత కక్షపూరితంగా,ద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారో.. మరోసారి నిరూపించుకున్నారు. అమరావతి నగరం కోసం బడ్జెట్ లో చేసిన కేటాయింపులన్నీ కేవలం.. రైతులకు చెల్లించే కౌలుసొమ్ము, ఇతర ఆర్థిక సాయాలకు సరిపోయేవి మాత్రమే. ఈ ప్రభుత్వానికి ఈ చివరి ఏడాదిలో కూడా అమరావతిలో చిన్న నిర్మాణం అయినా చేపట్టడానికి వారు నిధులు కేటాయించలేదు.
జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. పోనీ అదే కరెక్టు.. ఆ ప్రకారమైనా చేయాలి అనే అనుకుందాం. ఆ లెక్కన చూసినా.. అమరావతిలో శాసనరాజధాని ఏర్పాటు కావాలి కద. ఆ నగరానికి ఒక చిన్న అస్తిత్వం అయినా ఏర్పడాలి కదా. ఒకవైపు విశాఖలో ప్రకృతి సంపదలను సర్వనాశనం చేస్తూ… కొండలను తవ్వి హర్మ్యాలను నిర్మిస్తున్న జగన్ సర్కారు.. అమరావతిలో వారి ఆలోచన ప్రకారం కనీసం న్యాయ రాజధానికి తగినట్టుగా అయినా ఏం చేసింది. ఏ కొత్త నిర్మాణాలు చేసింది. అర్థం కాని సంగతి.
అమరావతి పట్ల అడుగడుగునా ద్వేషం, నగరాభివృద్ధి విషయంలో వారి ఆలోచనల్లో విషం నిండి ఉండడమే ఇందుకు కారణం. అమరావతిని మొత్తం కేవలం శ్మశానంలాగా మార్చేయడమే కాదు.. శిథిలమైన శ్మశానంలాగా మార్చి.. అక్కడొక అత్యద్భుతమైన ప్రపంచం మొత్తం తలతిప్పి చూసేంత గొప్ప నగరం వస్తుందని కలలు కన్న, ఆ కలలను విశ్వసించిన వారందరికీ మన:క్షోభ కలిగించడమే వారి లక్ష్యం. ఒక మరుభూమి నిర్మాణంలో తమను తాము తరింపజేసుకుంటూ మురిసిపోవడం ఈ ప్రభుత్వం తీరుగా మారింది.
జగన్మోహన్ రెడ్డి.. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే.. చంద్రబాబునాయుడు ఇంటివద్ద ఉన్న ప్రభుత్వ నిర్మాణం ప్రజావేదికను కూలగొట్టించి.. ఈ నాలుగేళ్లుగా ఆ శిథిలాలను కూడా అక్కడినుంచి పక్కకు తొలగించకుండా.. తన పాలన ఏరీతిగా సాగబోతున్నదో ఆరోజే స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు హయాంలో డెబ్భయి శాతం పూర్తయిన అధికార్ల నివాస భవనాలను అక్కడితో వదిలేసి.. అవన్నీ అలా శిథిలమైపోయేలా.. వాటికోసం వెచ్చించిన వందల కోట్ల ప్రజాధనం మట్టిగొట్టుకుపోయేలా వ్యూహరచన చేశారు. ఇప్పుడు జులైకెల్లా విశాఖకు రాజధానిని తరలించుకుపోతాం అని ప్రకటిస్తున్నారు. అమరావతిలో సగంలో ఉన్న నిర్మాణాలనైనా ఆయన ఎందుకు పట్టించుకోరు? ఎందుకంత ద్వేషం.. ఒక ప్రాంతం మీదనా, ఒక కులం మీదనా? కొత్తగా ‘విశాఖ రాజధాని’ అనే ముసుగులో తన కోటరీ సాగించగల తిరుగులేని దోపిడీమీద ప్రేమనా? అనే కోణాల్లో ప్రజలు తర్కించుకున్న నాడు.. ఆయన ప్రభుత్వానికి మరణశాసనం రాస్తారని గ్రహించాలి.
మరుభూమిలా మార్చేసి.. ఆనందించే తత్వం!
Sunday, January 19, 2025