మంత్రి అంబటి బతుకు లాటరీ అయిపోయిందా?

Saturday, September 7, 2024

రాజకీయాలలో ఉన్న వారికి రుజుమార్గంలో వచ్చే సంపాదన మీద కంటే కొసరు మీదనే ధ్యాస ఎక్కువగా ఉంటుంది! అనుచితమైన ఆదాయాల కోసం అతిగా ఆశపడుతుంటారు. రకరకాల తప్పుడు మార్గాలు తొక్కుతుంటారు. రాజకీయ నాయకుల హోదాలు, స్థాయిలను బట్టి వారి వారి అక్రమ సంపాదనల మార్గాలు మారుతుంటాయి. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన స్థాయి వారైతే.. ఎన్నికలలో తాము పెట్టిన మొత్తం పెట్టుబడికి వడ్డీని మించి గిట్టుబాటు అయ్యేలా లెక్కలు వేసి మరీ సంపాదిస్తుంటారు. మంత్రి స్థాయికి వెళితే ఇక చెప్పే అవసరమే లేదు. సామాన్యుడి ఊహకు అందని వక్రమార్గాలు వారి పర్సనల్ ఖజానాలలో కోట్లు కుమ్మరింప చేస్తుంటాయి.
సాధారణంగా ఎమ్మెల్యే ఆ పై స్థాయికి చెందిన నాయకులు గుట్టు చప్పుడు కాకుండా, రెండో కంటికి తెలియకుండా తమ దందాలను పూర్తి చేస్తుంటారు. నియోజకవర్గంలో ప్రజల జోలికి వెళ్లకుండా పెద్ద పెద్ద బిగ్ డీల్స్ తో మాత్రమే సరిపెట్టుకుంటూ ఉంటారు. లంచాలు మరిగిన పోపిడి కూడా నియోజకవర్గంలో తెలియకుండా కొందరు జాగ్రత్త పడుతుంటారు. అయితే లాటరీ నిర్వహించి ప్రజల ఆశలతో ఆడుకుంటూ సొమ్ము చేసుకోవాలనుకోవడం వీటన్నింటితో పోలిస్తే చాలా చీప్ ట్రిక్. గౌరవనీయమైన మంత్రి పదవిలో ఉన్న సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంక్రాంతి ముసుగు కింద లాటరీ నిర్వహణకు తెరతీసినట్లుగా, ప్రజల ఆశలతో ఆడుకుంటున్నట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లాటరీ దందాలను ఆపు చేయించాలని కోరుతూ నియోజకవర్గంలోని జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం.
లాటరీ టికెట్ల విక్రయం అనేది చట్టప్రకారం నిషేధం కాగా, అమాయకులకు వాటిని విక్రయిస్తూ మంత్రి రాంబాబు ప్రజల్ని మోసగిస్తున్నారంటూ.. ఆయన మీద చర్యలు తీసుకోవాలని జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమాషా ఏంటంటే.. అంబటి రాంబాబు ఆధ్వర్యంలో జరుగుతున్నట్టుగా జరుగుతున్న ఈ లాటరీ దందాకు కూడా వైఎస్ఆర్ పేరును తగిలించడం. వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో ఒక్కొక్కటి వంద రూపాయలకు టికెట్లు అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. పైగా ఈ లాటరీ టికెట్లను వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైసీపీ నేతలు, కార్యకర్ల ద్వారానే అమ్మకాలు సాగిస్తున్నారట.
ప్రభుత్వంలో చాలా కీలకంగా అందరూ పరిగణించే నీటిపారుదల శాఖ మంత్రిగా వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు డీల్ చేస్తూ ఉండవలసిన మంత్రి అంబటి, ఇలా వందకు ఒకటి వంతున లాటరీ టికెట్లు అమ్ముకోవాల్సిన దుస్థితికి దిగజారిపోయారా? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. మరి పోలీసులు ఈ దందాను ఆపడానికి ఏం చేస్తారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles