దేశానికి భావి ప్రధాని కాగలననే నమ్మకంతో ఉన్న రాహుల్ దేశవ్యాప్త జొడో యాత్ర తర్వాత తన అబ్జర్వేషన్ లను ఏ రకంగా బయట పెడతారో అని దేశం ఎదురు చూస్తూ ఉన్నది. యాత్ర ఇంకా పూర్తి కాకపోయినప్పటికీ రాహుల్ కన్యాకుమారి నుంచి ఢిల్లీ దాకా చేరిన తన యాత్రలో పరిశీలించిన అంశాలను స్థూలంగా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేశారు. సాధారణంగా ఇలాంటి సందర్భాలలో రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విపక్షాలు మాత్రమే అధికారంలోకి వస్తాయి అని కాంగ్రెసుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని జనాంతికంగా ఒక మాట చెప్పాలి. కానీ రాహుల్ గాంధీ అలాంటి సాంప్రదాయ మాటలను పట్టించుకోవడం లేదు. కనీసం తన మాటలు పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిని ఇవ్వాలని, వారిలో ఉత్సాహాన్ని నింపాలని కూడా అనుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో భాజపా ఓటమి గురించి ఆయన సంశయాత్మకంగానే మాట్లాడుతున్నారు. కాస్త లోతుగా, విడగొట్టి చూస్తే రాహుల్ మాటలు.. వచ్చే ఎన్నికల్లో భాజపా ఘనవిజయాన్ని ధ్రువీకరిస్తున్నట్టే ఉన్నాయి.
‘భాజపాపై క్షేత్రస్థాయిలో బయటకు కనిపించని తీవ్ర వ్యతిరేకత ఉన్నదని’ రాహుల్ గాంధీ అన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిస్తే ఓడించడం కష్టం కాదని అంటున్నారు. కొన్ని వారాలను రివైండ్ చేసుకుంటే గనుక.. గుజరాత్ ఎన్నికల సమయంలో అప్పుడే కొత్తగా పార్టీ జాతీయ సారథ్య బాధ్యతలను స్వీకరించిన మల్లికార్జున ఖర్గే ఇదే మాట అన్నారు. గుజరాత్ లో భాజపా పట్ల కనిపించని వ్యతిరేకత ఉన్నదని, నిశ్శబ్ద విప్లవం వచ్చి కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు. కానీ ఆ నిశ్శబ్ద విప్లవం అనేది కుందేటికొమ్ము అనే సంగతి ఆ తర్వాత అర్థమైంది.ఎంత బీభత్సంగా గుజరాత్ లో బీజేపీ గెలిచిందో అందరూ గమనించారు. ‘కనిపించని వ్యతిరేకత’ అంటూ ఇప్పుడు రాహుల్ మాటలు, ఆనాటి ఖర్గే మాటలనే గుర్తుకు తెస్తున్నాయి.
దేశంలోని ప్రతిపక్షాలన్నీ తన యాత్రకు మద్దతు పలికాయట. కాబట్టి.. ప్రతిపక్షాలు అందరూ కలుద్దాం అని ఈ భావిప్రధాని ఆశావహుడు అంటున్నారు. అందరూ కలుద్దాం.. మోడీని ఓడిద్దాం అని వారికి నమ్మకం కలిగంచడంలేదు. అందరమూ కలిస్తే.. మోడీని ఓడించడం కష్టమేమీ కాదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇన్నిరోజుల పాటు ఇంత దేశం తిరిగి ఆయన కనుగొన్నది ఇదేనా? ఒకవైపు కాంగ్రెస్ తో మిత్రపక్షాలుగా వ్యవహరించిన వారు కూడా ఈ దఫా ఆయన యాత్రకు దూరంగా ఉండిపోగా, రాహుల్ మాత్రం భావజాలం పరంగా దేశంలోని అన్ని ప్రతిపక్షా పార్టీలో కాంగ్రెసుతోనే ఉన్నాయని చెప్పుకోవడం ఒక రకమైన ఆత్మవంచన.
ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లడమే కష్టం. ఇంకా అధికారం దాకా తీసుకువెళ్లగలరనేది అనూహ్యం.
భాజపా విజయాన్ని ధ్రువీకరిస్తున్న రాహుల్!
Sunday, December 22, 2024