కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అంటారు పెద్దలు. అలాగే.. వచ్చే 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనం అయితే గనుక.. అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఈ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, సంక్షేమం పేరుతో సాగిస్తున్న మాయ, వికేంద్రీకరణ పేరుతో నడుస్తున్న భూదందాలు, చేతగాని పరిపాలన.. వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతుండడం వంటి కారణాలు మాత్రమే కాదు.. కొందరు వ్యక్తులు కూడా పార్టీ పతనాన్ని, సర్వనాశనాన్ని శాసించగలరు. వారి తీరు, ప్రవర్తన, మాటలు, చేతలు అన్నీ కూడా కలిసి.. పార్టీని ప్రజలు అసహ్యించుకోవడారనికి కారణం అవుతాయి. అలాంటి వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మనకు అనేకమంది కనిపిస్తారు. వారిలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది.
గోరంట్ల మాధవ్ అనగానే.. న్యూడ్ వీడియో కాల్ ఎపిసోడ్ గుర్తుకు వస్తుంది. అవతలి మహిళతో న్యూడ్ గా కాల్ మాట్లాడడం మాత్రమే కాదు.. అది లీకైన తర్వాత.. ఎదురు కేసులు పెట్టి దబాయించడం.. నానా బూతులతో తెలుగుదేశం వారిని తిట్టడం, వీడియో లీక్ చేసిన వారిపై, వ్యాఖ్యానించిన వారిపై అత్యంత నీచమైన భాషతో దూషించడం ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఆ ఒక్క ఎపిసోడ్ తో పార్టీ పరువును ఎంత దారుణంగా బజార్లో పెట్టవచ్చో.. అంత ఘోరంగానూ గోరంట్ల మాధవ్ చేశారు. అయితే పార్టీ మాత్రం ఆయనను నెత్తిన పెట్టుకుండి. ఆ వ్యవహారాన్ని ఖండించి.. అతని మీద చర్యలు తీసుకుని.. వైసీపీ ప్రభుత్వం మహిళల గౌరవానికి భంగం కలగకుండా ఉంటుందని నిరూపించుకోవల్సిన సర్కారు.. ఆయనకు కొమ్ముకాసి, ఆయన న్యూడ్ కాల్ ను సమర్థించి.. దాన్ని లీక్ చేశారంటూ.. పలువురిపై కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేసింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా మళ్లీ గోరంట్ల మాధవ్ వార్తల్లో వ్యక్తి గా నిలుస్తున్నారు. ఏకంగా లోక్ సభ ఎంపీగా ఉన్న ఈ వ్యక్తి.. తాను ఉంటున్న ఇంటికి అద్దె చెల్లించకుండా.. అడిగితే దబాయిస్తూ, బెదిరిస్తూ సాగిస్తున్న దందా పార్టీ పరువును మరోసారి రచ్చకీడుస్తోంది. మాధవ్ ఎంపీ అయిన తర్వాత.. అనంతపురంలో మల్లికార్జున రెడ్డి ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆరునెలల్లోగా ఇంకో ఇంటికి వెళ్లిపోతాననేది తొలుత చెప్పిన మాట. ఏళ్లు గడిచినా.. ఖాళీ చేయలేదు సరికదా.. అద్దె కూడా చెల్లించడం లేదు. అంతకంటె కామెడీ ఏంటంటే.. తాను వాడుకుంటున్న కరెంటు బిల్లులు కూడా కట్టడం లేదు. ఇల్లు ఖాళీ చేయాలని అడిగిన ప్రతిసారీ గొడవ పెట్టుకుంటున్నాడు. తాజాగా ఈ వ్యవహారం పోలీసుల దాకా వెళ్లింది. అద్దె కింద 13 లక్షలు, కరెంటు బిల్లులు మరో 2.5 లక్షలు చెల్లించాల్సి ఉందని మల్లికార్జున రెడ్డి అంటున్నారు.
గోరంట్ల మాధవ్ లాగా చవకబారు రీతిలో అద్దె ఎగ్గొడుతూ అడిగితే బెదిరిస్తూ ఉండే నాయకులు తయారైతే.. ఆయా పార్టీల మీద ప్రజలకు గౌరవం పోతుంది. అసహ్యం ఏర్పడుతుంది. జిల్లాకొక్కరు ఇలాంటి నాయకులు ఉన్నా.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని ప్రజలు అసహ్యించుకోవడానికి ఎంతోకాలం పట్టదు.