జగన్ తన ప్రసంగాలలో కొన్ని పడికట్టు పదాలను అలవోకగా వాడుతుంటారు. ఆత్మస్తుతులు, పరనిందలు మామూలే. కానీ సామాన్యులు కూడా నమ్మలేని సంగతులు కొన్ని చెబుతుంటారు. అలాంటి విషయాలు ఇప్పుడు బూమరాంగ్ అవుతున్నాయి. తిరిగి ఆయనకే తగులుతున్నాయి. ప్రజల దృష్టిలో జగన్ మాటలు కామెడీ అయిపోతున్నాయి. ప్రధానంగా జగన్ చెప్పిన క్లాస్ వార్ అనే నినాదం బ్యాక్ ఫైర్ అవుతోంది. బూమరాంగ్ గా మారుతోంది.
జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ప్రతి ప్రసంగంలోనూ తన పేదరికం గురించి చెబుతుంటాడు. తాను పేదవాణ్నని చెబుతుంటాడు. రాబోయే ఎన్నికలు ఒక ‘క్లాస్ వార్’ అని ఆయన అభివర్ణిస్తుంటారు. ఆ ఎన్నికలు పేదలకు- ధనికులకు మధ్య జరిగే పోరాటం అని ఆయన చెబుతుంటారు. అంటే జగన్ మాటల్లో ఆయన పేదవాడని, తెలుగుదేశం మరియు చంద్రబాబునాయుడు ధనికులు అని అర్థం అన్నమాట.
అధికారికంగా జగన్ సమర్పించిన లెక్కల ప్రకారమే దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయనకు తన సొంత డబ్బులతో నడుస్తున్న ఒక దినపత్రిక, ఒక న్యూస్ ఛానెల్ ఉన్నాయి. అవి నిత్యం ఆయన కరపత్రాల్లా పనిచేస్తుంటాయి. తనకు ఈనాడు, ఆంద్రజ్యోతి లేవని పదేపదే చెప్పుకునే జగన్ , తనకు సాక్షి ఉందనే సంగతి మాత్రం బయటకు అనరు. కానీ ఆయనకు ఏం ఉన్నదో ఏం లేదో జనానికి చాలా స్పష్టంగా తెలిసిన సంగతి. అందుకే ఆయన విమర్శలు నవ్వుల పాలవుతున్నాయి.
రాష్ట్రంలో జరగబోయేది క్యాస్ట్ వార్ కాదని, క్లాస్ వార్ అని జగన్ కొత్త భాష్యం చెప్పారు. అసలు ఇక్కడ క్యాస్ట్ వార్ జరుగుతుందని ఎవరు చెప్పారు గనుక.. అది కాదు అని ఆయన హడావుడి చేస్తున్నారో తెలియదు. కానీ జగన్ వర్ణించిన క్లాస్ వార్ నినాదం పని చేయలేదు. చంద్రబాబునాయుడు దానిని ‘క్యాష్ వార్’ గా అభివర్ణిస్తూ తిప్పి కొట్టారు.
ఇలాంటి పడికట్టు పదాలతో ప్రత్యర్థులను నిందించాలనుకుంటే.. ఆ మాటలు బెడిసి కొడుతున్నాయి. జగన్ ఇప్పుడు కొత్త స్ట్రాటజీలను వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. పాచిపోయిన విమర్శలు, నిందలతో నెగ్గవచ్చుననుకుంటే ఇబ్బంది పడతారు.
బూమరాంగ్ అవుతున్న జగన్ ‘క్లాస్ వార్’!
Thursday, November 21, 2024