అడుసుతొక్కనేల కాలు కడగనేల అని సామెత. కానీ బుద్ధి అడుసువైపే లాగుతూ ఉంటే.. ఎవ్వడైనా సరేఅడుసు తొక్కకుండా ఎలా ఉంటారు. తన అత్యుత్సాహంతో.. పార్టీ పెద్దల ఆగ్రహానికి గురై అక్షింతలు వేయించుకున్న ఓ కమల నాయకుడు.. ఇప్పుడు బురద కడుక్కునే పనిలో ఉన్నారు. తాను జగన్మోహన్ రెడ్డికి తొత్తును కాదని, ఆయన మీద కూడా విమర్శలు చేస్తానని నిరూపించుకోవడానికి రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టున్నారు.
ఏపీ బిజెపి నాయకుల్లో సారథి సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. జగన్మోహన్ రెడ్డి సర్కారుతో లోపాయికారీ ఒప్పందాలతో ఊరేగుతుంటారనే పుకార్లు వారి సొంతపార్టీలోనే పుష్కలంగా వినిపిస్తుంటాయి. అయితే ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అన్నట్టుగా ఈ నాయకులు అప్పుడప్పుడూ జగన్ కు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి మమ అనిపిస్తుంటారు. ఈ విద్యలో ఆరితేరిపోయిన జీవీఎల్ నరసింహారావు ఇటీవల కొత్త బురద అంటించుకున్నారు.
తెలుగుదేశంతో పొత్తును బలంగా కోరుకుంటున్న పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇటీవల ఢిల్లీ వెళ్లిన సందర్భంలో కమలం పెద్దలందరినీ కలిశారు. అయితే రెండోరోజు సాయంత్రం జెపినడ్డా అపాయింట్మెంట్ దొరికిన నేపథ్యంలో పవన్, నాదెండ్ల రెండోరోజు పగలు దాదాపు ఖాళీగా ఉన్నారు. వారిద్దరికీ బిజెపి నేతల అపాయింట్మెంట్లు దొరకడం లేదని, ఎవరు ఖాళీగా ఉంటే వారిని కలుస్తున్నారని టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ లు వెల్లువలా వచ్చాయి. అయితే.. జీవీఎల్ స్వయంగా తనకు సన్నిహితులైన మీడియా మిత్రులకు అలాంటి సమాచారం లీక్ చేసినట్టు పార్టీ వారికి తెలిసింది. పవన్ ఇమేజిని భంగపరచడానికి ఆయన అలా చేసినట్లు వారు భావించారు. సాయంత్రం జెపినడ్డాతో భేటీలో.. జీవీఎల్ వైఖరిని, జగన్ సర్కారుతో స్నేహబంధాన్ని గురించి కూడా పవన్ ఆయనకు వివరించినట్లు సమాచారం. దీనిపై నడ్డా ఆగ్రహించి.. జీవీఎల్ కు అక్షింతలు వేశారు.
జగన్ అనుకూల ముద్రతో బురద అంటుకునే సరికి.. జీవీఎల్ దానిని కడుక్కునే పనిలో పడ్డారు. విశాఖకు వచ్చి.. ‘నువ్వే మా భవిష్యత్తు జగన్’ కార్యక్రమానికి వ్యతిరేకంగా పార్టీ ప్రచురించిన పోస్టర్లను ఆవిష్కరించారు. జగనన్నే భవిష్యత్తు అని చెబితే.. భవిష్యత్తు మొత్తం అంధకారమే అవుతుందని విమర్శించారు. మొత్తానికి పవన్ కల్యాణ్ వెనక గోతులు తవ్వాలని అనుకున్నందుకు.. ఈ కమల నేత తనకు అంటుకున్న బురద కడుక్కోడానికి నానా పాట్లు పడుతున్నారు.
బురద కడుక్కునే పనిలో కమలనేత!
Sunday, December 22, 2024