ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికీలక పదవులు ఉన్నప్పటికీ అన్నింటినీ రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే కట్టబెడుతున్నారనే కీర్తి జగన్మోహన్ రెడ్డికి చాలా బలంగా ఉంది. ఆ కీర్తిని తొలగించుకోవడానికి ఆయన ఇప్పుడిప్పుడే కసరత్తు ప్రారంభిస్తున్నట్టుగా కనిపిస్తోంది. తొలి ప్రయత్నంగా.. వేటు బాబాయి మీద పడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తలమండలి ఛైర్మన్ గా ఉన్న బాబాయి వైవీ సుబ్బారెడ్డిని ఆ పదవినుంచి తొలగించి.. కొత్తగా ఒక బీసీ నేత చేతుల్లో పెట్టాలని జగన్ సంకల్పిస్తున్నట్టు పుకార్లు వస్తున్నాయి. నిజానికి టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఉన్నప్పటికీ.. ఆ తర్వాత కొత్త చైర్మన్ ను నియమించినా కూడా వారికి కనీసం ఏడాది హోదా కూడా ఉండదు గనుక.. జగన్ ఇప్పుడే ఈ మార్పు చేదలచుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. జనవరిలో వైకుంఠ ఏకాదశి, తదనుబంధంగా పదిరోజుల పాటు ఉండగల వైకుంఠద్వార దర్శనాలు, ఆ పర్వదినాల పర్వం పూర్తయిన తర్వాత.. టీటీడీకి కొత్త బోర్డు ఏర్పాటు కాబోతున్నదని సమాచారం.
టీటీడీ బోర్డు అనేది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రకరకాలుగా భ్రష్టు పట్టిపోయింది. రెండుదఫాలు ఛైర్మన్ గా సారథ్య బాధ్యతలను బాబాయి వైవీసుబ్బారెడ్డి చేతుల్లోనే పెట్టారు జగన్. కానీ రెండోసారి బోర్డుతో పాటు సలహాదారులు, ప్రత్యేకఆహ్వానితులు లాంటి రకరకాల పేర్లను సృష్టించి ఓ జంబో బోర్డును తయారుచేసి భ్రష్టు పట్టించారు. అందరూ దర్శనాల పైరవీలకు సిఫారసు ఉత్తరాలు ఇచ్చుకోవడం తప్ప మరో వ్యాపంక లేదన్నట్టుగా బోర్డు తయారైంది. ఈ జంబో బోర్డుపై కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది.
ఈ తలనొప్పులన్నింటికీ ఒకేసారి ఫుల్ స్టాప్ పెడుతూ.. ఇప్పుడున్న బోర్డును సమూలంగా రద్దు చేసేసి.. ప్రత్యేకఆహ్వానితులు వంటి వివాదాస్పద నియామకాలు లేకుండా బోర్డును మాత్రం సరికొత్తగా ఏర్పాటుచేయడానికి జగన్ డిసైడయ్యారు. అదికూడా బీసీ నేత చేతుల్లోనే బోర్డు సారథ్యం పెట్టాలనుకుంటున్నారు. బాబాయి వైవీ సుబ్బారెడ్డిని మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకువస్తూ.. ఉత్తరాంధ్రకు సంబంధించిన పూర్తి బాధ్యతలను అప్పగించదలచుకున్నట్టుగా తెలుస్తోంది.
ఒకప్పట్లో టీటీడీ బోర్డు సభ్యత్వం అంటే ఒక గౌరవం, మర్యాద ఉండేవి. ఆధ్యాత్మిక శ్రద్ధ ఉన్నవారికే ఆ పదవులు దక్కేవి. కాలక్రమంలో రాజకీయ నిరాశ్రయులకు ఈ పదవులు ఇవ్వడం మొదలైంది. రాజకీయంగా పదవుల్లోకి వచ్చేవారు.. సహజంగా పైరవీలకు పెద్దపీట వేయడమూ మొదలైంది. క్రమంగా టీటీడీ బోర్డు సభ్యులంటేనే పారిశ్రామికవేత్తల ముసుగులో ఉండే దళారీలు, రాజకీయ దళారీలు, సేవల టికెట్లను అమ్ముకునే వాళ్లు, వాటిద్వారా పైరవీలు చేసుకునే వాళ్లు అనే ముద్ర పడిపోయింది. ఈసారైనా కాస్త దేవుడి మీద శ్రద్ధ ఉండేవారిని జగన్ టీటీడీ బోర్డులో నియమిస్తే బాగుంటుంది.
టీటీడీపై బీసీ రంగు పడాలి!! బాబాయ్ ఇక ఇంటికే!
Saturday, November 23, 2024