తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎట్టకేలకు తన స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి మలిఅడుగు కూడా వేశారు. భాగ్యనగరంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను నిర్వహించిన కేసీఆర్, హస్తినాపురంలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అయితే కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుందనే సామెత చందంగా.. దేశవ్యాప్త రాజకీయాల్లో కేసీఆర్ ముద్ర ఎలా ఉండబోతోందనే సంగతి.. ఆఫీసు ప్రారంభం నాడే సంకేతమాత్రంగా తెలుస్తోందా? అని అంతా అనుకుంటున్నారు.
కర్ణాటకలో జనతాదళ్ నాయకుడు కుమారస్వామి.. కేసీఆర్ కు జాతీయ రాజకీయాల్లో ప్రధాన అనుచరుడుగా మారిపోయిన సంగతి తొలినుంచి అందరూ గమనిస్తున్నదే. బిఆర్ఎస్ పేరుతో ఏ కార్యక్రమం జరిగినా టంచనుగా కుమారస్వామి హాజరు అక్కడ ఉంటుంది. కుమారస్వామి మీద నమ్మకంతోనే.. వచ్చే ఏడాదిలో కర్ణాటక ఎన్నికల్లో బరిలోకి దిగుతాం అని బిఆర్ఎస్ సారదిగా కేసీఆర్ ప్రకటించారు కూడా. కాబట్టి అదే కుమారస్వామి ఢిల్లీ కార్యక్రమంలో కూడా కనిపించడం పెద్ద విశేషమేం కాదు. ఆయనను మినహాయిస్తే.. యూపీలోని సమాజ్ వాదీ పార్టీ సారధి అఖిలేష్ యాదవ్ మినహా.. ఇతర జాతీయ పార్టీల నుంచి ఒక్క నాయకుడు కూడా కేసీఆర్ కార్యాలయ ప్రారంభోత్సవానికి రాకవపోడం గమనించాల్సిన సంగతి.
కేసీఆర్ దాదాపుగా రెండు సంవత్సరాలకంటె ఎక్కువ కాలంనుంచి.. జాతీయ రాజకీయాల మాట ఎత్తుతున్నారు. అనేక రాష్ట్రాలు పర్యటించి.. అక్కడ ప్రాంతీయ పార్టీల సారథులతో భేటీ అవుతున్నారు. వారితో కలిసి జాతీయ రాజకీయాల్లో పనిచేస్తాం అని గతంలో అనేకమార్లు ప్రకటించారు. అయితే అప్పట్లో ఆయన మాట అందరితో కలిసి మూడో కూటమి ఏర్పాటు చేయడం అనేదిశగా ఉండేది. చాలా మంది నాయకులు ఆయనకు కనీసం స్పందించారు.. భేటీ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ తానే ఒక జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత.. ఢిల్లీ ఎర్రకోటమీద తన గులాబీ జెండగానే ఎగరేస్తానని అంటున్నప్పుడు.. ఇక ఇతర పార్టీల వారు ఆయనను ఎలాచూస్తారనేది కీలకాంశం. అఖిలేష్ తప్ప.. కనీసం ఢిల్లీ సీఎం, ఇటీవల కేసీఆర్ వెళ్లి భేటీ అయిన కేజ్రీవాల్ కూడా కార్యక్రమానికి రాలేదు.
ఆ మాటకొస్తే.. ప్రారంభోత్సవానికి రెండు రోజుల ముందే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ అనేక పార్టీల నాయకులను కలిసి ఆహ్వానిస్తారని బీఆర్ఎస్ మీడియాకు తెలియజేసింది. ఆ ప్రయత్నం జరిగిందో లేదో తెలియదు. మొత్తానికి బిఆర్ఎస్ కార్యాలయ ప్రారంభానికి వచ్చిన వాళ్లు మాత్రం లేనేలేరు. ఇలా ఒంటరిగా, ఎవరూ తనను నమ్మకపోతుండగా, కేసీఆర్ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరేయడం అనేది ఎప్పటికి సాధ్యం అవుతుంది.
తెలంగాణలో బిఆర్ఎస్ కు, వామపక్షాలతో పొత్తులు ఉన్నాయి. కేసీఆర్ ను వారు కీర్తిస్తుంటారు. మునుగోడులో సైతం వారు బిఆర్ఎస్ విజయానికి పనిచేశారు. అలాంటి వామపక్షాలు కూడా ఢిల్లీ కార్యక్రమంలో కనిపించలేదు. కుమారస్వామి, అఖిలేష్ మినహా మరో జాతీయ పార్టీల నాయకుడు లేకుండా.. కేసీఆ కార్యక్రమం నడిపించే సంకేతాలు అంత పాజిటివ్ గా కనిపించడం లేదు. మరి జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎలా నెగ్గుకొస్తారో.. అందరినీ కలుపుకుని ముందుకు సాగడానికి తన వ్యూహాలను ఎలా మార్చుకుంటారో వేచిచూడాలి.