భారతీయ జనతా పార్టీ కీలక నాయకులు ఏపీలో సభలు పెట్టి.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ మీద తీవ్రమైన విమర్శలు కురిపించిన తరువాత.. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బిజెపి తీరు మీద, రాష్ట్రానికి బిజెపి చేసిన అన్యాయం మీద వైసీపీ నేతలు, మంత్రులు మాట్లాడుతున్నారు. విరుచుకుపడుతున్నారు. రాజకీయాలు ఎంత సిగ్గుమాలిన వ్యవహారంగా తయారయ్యాయో.. ఈ రెండు పార్టీల అనుబంధం, శత్రుత్వం గమనిస్తే మనకు అర్థమవుతుంది.
నిన్నటిదాకా రెండు పార్టీల మధ్య అప్రకటిత స్నేహబంధం ఉంది. మోడీ ఎప్పుడు ఎక్కడ తారసపడినా సరే.. మున్ముందుగా ఆయన పాదాలను స్పృశించి ఆశీస్సులు అందుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాపత్రయపడుతూ వచ్చారు. రాష్ట్రంలో జగన్ నిర్ణయాలు ఎలా ఉన్నాసరే.. చూసీచూడనట్టుగా వ్యవహరిస్తూ, అప్పుడప్పుడూ ఒక విమర్శ చేసి చేతులుదులుపుకుంటూ రాష్ట్ర కమలనాధులు ఉండిపోయారు. ఇప్పుడు సీన్ మారింది. కేంద్ర బిజెపి నాయకులు.. ఒక్కసారిగా ఏపీ సర్కారు మీద విమర్శలు పెంచారు. వారి భూబాగోతాలు, లిక్కర్ భాగోతాలు, కబ్జాలు, అవినీతి స్వాహాపర్వాలు అన్నింటినీ ప్రశ్నిస్తున్నారు. వీరికి కూడా కోపం వచ్చింది. రాష్ట్రానికి ద్రోహం చేశారని, విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారని, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దీక్ష చేసినప్పుడు వారిని పట్టించుకోలేదని ఎడాపెడా కేంద్రాన్ని తిట్టిపోస్తున్నారు. ఈ శత్రుత్వం హఠాత్తుగా పుట్టింది. అందుకే వీటిని సిగ్గుమాలిన రాజకీయాలుగా అనుకోవాల్సి వస్తోంది.
ఇవాళ జగన్ చేసిన పాపాలను ప్రశ్నిస్తున్న బిజెపికి నిన్నటిదాకా కళ్లు మూసుకుపోయాయా? వాటిపట్ల నిర్లిప్త భావంతో ఉండడం వల్ల తాము చేస్తున్న పనులకు వారి ఆశీస్సులు ఉన్నట్టుగానే భావిస్తూ జగన్ ముందుకెళ్లారు. జగన్ రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అనాథలా ఇవాళ నిలబెట్టారంటే ఆ పాపంలో బిజెపికి కూడా భాగం ఉంటుంది కదా అనేది విశ్లేషకుల భావన. అదేరీతిగా రైతుల పట్ల బిజెపి అమానుషంగా వ్యవహరించిందనే మాట వైసీపీ నేతల నుంచి ఇవాళ వినిపిస్తోంది. ఆరోజు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నప్పుడు వైసీపీ తన విధానాన్ని స్పష్టం చేయలేకపోయింది. బిజెపి తప్పు చేస్తున్నదని చెప్పకుండా నాటకాలు ఆడింది. అప్పుడంతా మౌనంగా ఉండి, తెరమరుగైన ఆ అంశం గురించి ఇప్పుడు విమర్శిస్తున్నారు.
ఇలాంటి తమ వ్యవహారం చవకబారు రాజకీయం అని, ఇలాంటి వేషాలను ప్రజలు సులువుగానే గుర్తిస్తారని వైసీపీ నేతలు, బిజెపి నేతలు ఆమాత్రం గుర్తించలేకపోతున్నారా అనేది పరిశీలకుల భావన!
బిజెపి, వైసీపీ .. సిగ్గుపడాల్సినది ఎవరు?
Sunday, December 22, 2024