భారతీయ జనతా పార్టీలో కర్ణాటకలో ఎట్టి పరిస్తితుల్లోనూ విజయం సాధించాలనే ఆరాటం ఎంత తీవ్రంగా ఉన్నదో వారు విడుదల చేసిన తొలిజాబితా చూస్తే అర్థమవుతుంది. చాలామంది సిటింగ్ ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టారు. కర్నాటకలో మొత్తం 224 స్థానాలుండగా ప్రస్తుతానికి 189 మంది పేర్లతో తొలిజాబితా విడుదల చేశారు. ఇందులో 52మంది తొలిసారి బరిలోకి దిగుతున్నారు.
కన్నడనాట ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనే బిజెపి ప్రధానంగా పోటీని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీలో దిగ్గజ నాయకులు ప్రస్తుతానికి కేపీసీసీ అధ్యక్షుడు డికె శివకుమార్, మాజీ మంత్రి సిద్ధరామయ్య ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లయితే ముఖ్యమంత్రి రేసులో ఉన్నది కూడా వీరిద్దరే. సహజంగానే ఈ ఇద్దరు నాయకులమీద బిజెపి ఎక్స్‌ట్రా ఫోకస్ పెట్టింది. ఈ ఇద్దరిని ఓడించడానికి చూస్తోంది. అయితే వారి మీద పోటీకి తొడకొడుతున్న కమలం అభ్యర్థులు ఓడిపోయే ప్రమాదం ఉంటుంది గనుక.. వారి సేఫ్టీకోసం వారికి అదనంగా ఇంకో నియోజకవర్గంలో కూడా టికెట్ ఇచ్చింది. అంటే కాంగ్రెస్ బిగ్ షాట్స్ మీద పోటీచేస్తున్నందుకు వారికి డబల్ బొనాంజా అన్నమాట.
కేపీసీసీ సారథి డికె శివకుమార్ కనకపుర నియోజకవర్గంలో బరిలో ఉన్నారు. అక్కడ ఆయన సిటింగ్ ఎమ్మెల్యే. మళ్లీ గెలిచే అవకాశం ఉంది కూడా. అయితే ఆయనను ఓడించే ఉద్దేశంతో బిజెపి తమ పార్టీ తరఫున ఆర్ అశోక పేరును ప్రకటించింది. అయితే అశోక పద్మనాభనగర్ లో సిటింగ్ ఎమ్మెల్యే. ఆ స్థానాన్ని వదులుకుని, ఆయన డికె మీద పోటీచేయడానికి ఎందుకు సాహసిస్తారు? ఎందుకు త్యాగం చేస్తారు? అందుకే ఆయనకు సిటింగ్ స్థానంలో కూడా టికెట్ ఇచ్చారు. ఆయన రెండు చోట్ల పోటీచేస్తున్నారు. డికెను ఓడించగలిగితే ఓకే.. లేకపోతే ఆయనకు సొంత సీటు ఎటూ ఉంటుందన్నమాట.
అలాగే కాంగ్రెస్ తరఫున మరో సిఎం అభ్యర్థి సిద్ధరామయ్య మీద వరుణ నియోజకవర్గం నుంచి పోటీకి ప్రకటించిన సోమన్నకు, మరో అసెంబ్లీ సీటు చామరాజనగర కూడా కేటాయించారు.
అయితే కాంగ్రెస్ సీఎం అభ్యర్థుల మీద పోటీకి సిద్ధపడిన వారికి అదనంగా మరో ఎమ్మెల్యే నియోజకవర్గం కూడా ఇవ్వడం అనేది బిజెపిలోని ఓటమి భయానికి నిదర్శనం అని ప్రచారం జరుగుతోంది. బలిపశువులుగా రంగంలోకి దింపి, వారికి డబల్ బొనాంజా ఆఫర్ ఇచ్చారని అంతా అనుకుంటున్నారు.
బిజెపి.. బలిపశువులకు డబల్ బొనాంజా!
Wednesday, January 22, 2025