భారతీయ జనతా పార్టీ పవన్ కల్యాణ్ ను వాడుకుని వదిలేస్తుందా? కరివేపాకు చందంగా పోపులో వాసన కోసం వేసి, ఆ తర్వాత తీసి పక్కన పెట్టేస్తుందా? ఆ పార్టీ నాయకుల వ్యవహార సరళి మాటలు గమనిస్తోంటే.. ఇప్పుడు ఇలాంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. గోదావరి జోన్ బిజెపి నాయకులతో తాజాగా ఓ సమావేశం నిర్వహించుకున్నారు. రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవధర్, రాష్ట్రపార్టీకి కింగ్ పిన్ మధుకర్ కూడా పాల్గొన్నారు.
గోదావరి జోన్ పరిధిలోని కాకినాడ, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాలను భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుచుకోవాలని.. ఈ సమావేశంలో నాయకులు డిసైడ్ చేశారు. ఆ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీకి తొలినుంచి కూడా కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చేలాగా పార్లమెంటు సీట్లు గెలిస్తే చాలు అనే ఫోకస్ మాత్రమే ఉంటుందనేది అందరికీ తెలిసిన సంగతే. దానికి తగ్గట్టుగానే వారు అడుగులు వేస్తుంటారు. రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీ తమ శత్రువు కానంత వరకు, కేంద్రంలో తమకు అవసరం ఏర్పడిన సందర్భాల్లో వారితో మంచిగా తమ పనులు చక్కబెట్టించుకుంటారు. అంతే తప్ప బలంలేని ఏపీలో ఎమ్మెల్యే సీట్ల గురించి వారికి ఎలాంటి పట్టింపు ఉండదనేది అందరికీ తెలుసు.దానికి తగ్గట్టుగానే.. గోదావరి జోన్ నాలుగు ఎంపీసీట్లను గెలవాలని వాళ్లు సన్నద్ధం అవుతుండడం విశేషం.
వారి సన్నాహాలు సరే.. మరి పవన్ కల్యాణ్ సంగతేమిటి? జనసేన సంగతేమిటి? ఎన్డీయేలో జనసేన భాగస్వామి అని ఉభయులూ చెప్పుకుంటూ ఉంటారు. మరి భాగస్వామ్య ధర్మం ఇదేనా? కనీసం ఇలాంటి సమావేశం బిజెపి నిర్వహించుకున్నప్పుడు.. ఈ నాలుగు స్థానాల్లోనూ ఎన్డీయే అభ్యర్థులే విజయం సాధించేలా పనిచేయాలి.. అనే మాట అయినా వాడి ఉండొచ్చు కదా? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.
రాష్ట్రంలో పవన్ కల్యాణ్ తమకు మిత్రుడు అని చెప్పుకోవడం ద్వారా ప్రజల్లో కాస్త క్రేజ్ పెంచుకోడానికి బిజెపి తపన పడుతుంటుంది. పవన్ కు ఉన్న అనల్పమైన ప్రజాదరణ.. అంతో ఇంతో వారికి కూడా ఉపయోగపడుతుందనేది వారి ఆశ. మరి పవన్ క్రేజ్ ను తమకు వాడుకుంటున్నప్పుడు.. పవన్ కు, ఆయన పార్టీకి ప్రత్యుపకారం సంగతి తర్వాత.. కనీసం భాగస్వామ్య ధర్మంగా విలువ ఇవ్వాలనేది వారికి గుర్తుండాలి కదా.? వారి తీరు అలా కనిపించడం లేదు. ఆ మాటకొస్తే గోదావరి జోన్ లో ఉన్న నాలుగు గెలిచేయడం అనే ఆశ సంగతి తర్వాత.. ఏపీలో ఉన్న మొత్తం 25లో ఒక్కటంటే ఒక్క స్థానమైనా బిజెపి సొంతంగా పోటీచేసి గెలిచే పరిస్థితిలేదు. ఆ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఎన్నికలకు సంబంధించిన వ్యూహరచన, లక్ష్యనిర్దేశం చేసేప్పుడు.. పొత్తుల్లో ఉన్న పార్టీ జనసేన, పవన్ కల్యాణ్ లను విస్మరించడం సబబుగా లేదనే అభిప్రాయం పలువరిలో వ్యక్తం అవుతోంది. పవన్ కల్యాణ్ ను ఆ పార్టీ కరివేపాకులా వాడుకుని వదిలేస్తోందా? అని జనం అనుకుటున్నారు.
బిజెపి దృష్టిలో పవన్ కల్యాణ్ కరివేపాకేనా?
Wednesday, December 18, 2024