బిజెపి- టిడిపి పొత్తు : విన్-విన్ స్ట్రాటజీ!

Friday, November 22, 2024

భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తుకుదిరే వాతావరణం ఇప్పుడు కనిపిస్తోంది. ఢిల్లీలో అమిత్ షా మరియు జెపి నడ్డాలతో చంద్రబాబునాయుడు భేటీ కావడం, సుమారు గంటపాటు వారి సుదీర్ఘ చర్చలు సాగిన నేపథ్యంలో పొత్తు కుదరనుందనే విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. తెలుగుదేశం మళ్లీ ఎన్డీయేలో భాగస్వామి అవుతూ బంధం పెనవేసుకోవడం అనేది ఒక రకంగా చూసినప్పుడు.. ఇరు పార్టీలకు కూడా లాభదాయకం, ఇద్దరికీ ఉపయోగం అనే అంచనాలు విశ్లేషకుల్లో సాగుతున్నాయి.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఈసారి తాము ఒంటరిగానే అధికారంలోకి వచ్చేస్తాం అని చెప్పుకుంటూ ఉంది. ఆమాత్రం కాన్ఫిడెన్సు ప్రదర్శించడం అవసరమే. కానీ క్షేత్రస్థాయి వాస్తవాలను గమనించినప్పుడు ఆ పార్టీకి అంత సీన్ లేదని ఆ నాయకులే ఒప్పుకుంటున్నారు. ఇటీవలి ఈటల మాటలు కూడా ఖమ్మం జిల్లాలో పార్టీ బలహీనతలను చెప్పకనే చెప్పాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణ వ్యాప్తంగా కార్యకర్తల బలం పుష్కలంగానే ఉంది. కానీ.. నాయకులందరూ భారాస, కాంగ్రెస్ లలోకి వలసపోయారు. ఈ నేపథ్యంలో వారు పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. ఈ రెండు పార్టీల కలయిక అనేది ఖచ్చితంగా.. అధికారం గురించి కలగంటున్న బిజెపికి లాభం. పార్టీ తిరిగి లేచి నిలబడితే చాలనుకుంటున్న తెదేపా కోరిక కూడా నెరవేరుతుంది.
ఏపీలో కూడా ఇదే తరహా పరిస్థితి ఉంది. కమలనాయకులు అక్కడ ఎన్నికబుర్లు చెప్పినా సరే.. సొంతంగా లేదా జనసేనతో కలిసి వెళ్లినా కూడా వారికి ఒక్కటంటే ఒక్కసీటు కూడా దక్కదన్నది గ్యారంటీ. ఆ నేపథ్యంలో తెలుగుదేశంతో కలిసి పొత్తులు పెట్టుకుని, కొన్ని సీట్లను దక్కించుకుంటే.. వాటిలో కొంత మేర విజయావకాశాలు ఉండొచ్చు. కనీసం, సభలో మళ్లీ కాషాయకండువాలతో అడుగుపెట్టవచ్చు.
ఆ రకంగా ఈ రెండు పార్టీల పొత్తు ఉభయతారకంగా ఇద్దరికీ లాభదాయకం అవుతుంది.
తెలంగాణ కమల సారథి బండి సంజయ్.. పొత్తు అనేది ఊహాగానం మాత్రమే అని అంటున్నారు. అది కేవలం విలేకర్ల నుంచి ఎదురుకాగల ప్రశ్నల దాడిని తప్పించుకోవడానికి చెప్పే మాటలే అయి ఉంటాయి. ఎందుకంటే.. సొంతంగా రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులకు కూడా తమ పార్టీకి గతిలేదని వారికి తెలుసు. అమిత్ షా ను మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ లాంటి వాళ్లంతా కలుస్తుంటారు కదా.. అని బండి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు గానీ.. బాబు కలిసిన భేటీలో జెపి నడ్డా కూడా ఉండడం వల్లనే పొత్తు ప్రాధాన్యం, ప్రచారం బయటకు వచ్చింది. వీరి పొత్తులు ఎప్పటికి కుదురుతాయో ఏమో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles