కల్వకుంట్ల కవిత.. భారతీయ జనతా పార్టీ కేంద్రప్రభుత్వం మీద తరచుగా విరుచుకుపడడానికి ఒక సింగిల్ పాయింట్ ఎజెండా పెట్టుకున్నారు. తొమ్మిదేళ్లుగా ఆమెకు ఎన్నడూ ఈ ఆలోచన ఎందుకు రాలేదో తెలియదు గానీ.. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అనే అంశం టేకప్ చేశారు. తనకు బుద్ధి పుట్టినప్పుడెల్లా దానిమీద మాట్లాడుతూ ఉంటారు. ఇంకాస్త ఖాళీ దొరికితే ఢిల్లీ వెళ్లి మహిళా సంఘాల ప్రముఖులు, మహిళానేతలు ఇతర పార్టీల వారినందరినీ ఆహ్వానించి.. ధర్నాలు కూడా చేస్తారు. తండ్రి స్థాపించిన పార్టీ జాతీయ రూపం సంతరించుకున్న తర్వాత.. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలతో లైజానింగ్ మెయింటైన్ చేయడానికి తనకంటూ ఒక ఎజెండా పాయింట్ ఉండాలని ఆమె ఫిక్సయినట్టుగా ఆ వ్యవహారం కనిపిస్తుంది.
ఇంతా కలిపి.. తన తండ్రి 115 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే.. కేవలం ఏడుగురికి మాత్రమే మహిళలకు అవకాశం ఇచ్చారు. ఇదంతా లెక్కేస్తే ఆరుశాతమే అనిపించుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో కవిత.. బిజెపి మీద మహిళలకు అవకాశం ఇవ్వడం గురించి దండయాత్ర చేస్తున్నారు.
కిషన్ రెడ్డి లాంటి నాయకులు తమదైన శైలిలో చాలా సుతిమెత్తగా.. తెలంగాణ మొదటి కేబినెట్లో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదని అంటుండగా.. బండి సంజయ్ లాంటి నాయకులు ఒక్క కవితకు టికెట్ ఇస్తే చాలు, 33 శాతం మహిళలకు ఇచ్చినట్టే అని ఘాటుగా వెటకారం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఒక పనిచేసిందంటే.. కవితక్క నోటికి ఆటోమేటిగ్గా తాళాలు పడిపోతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో నిలపాలని భాజపా తలపోస్తోంది. ఈ అభ్యర్థుల జాబితాలో కనీసం పదిమంది మహిళలకైనా అవకాశం కల్పిస్తే చాలు, భారాస కంటె తమ పార్టీ మహిళలకు అగ్రప్రాధాన్యం ఇస్తున్నట్టుగా స్పష్టం అవుతుంది. భారాస కేవలం ఏడు టికెట్లు ఇవ్వగా, అంతకంటె ఎన్ని ఎక్కువ సీట్లు ఇచ్చినా.. బిజెపికి అది ఎడ్వాంటేజీనే అవుతుంది. పార్టీ వ్యూహాత్మకంగా ఆ పనిచేస్తే బాగుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.