దేశవ్యాప్తంగా మోడీ హవా ఎంతగానైనా చెలరేగుతుండవచ్చు గాక.. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ కి నిర్దిష్టమైన ఓటు బ్యాంకు ఏమీ లేదన్నది స్పష్టం. గత ఎన్నికల్లో వారికి దక్కిన ఒక్కశాతం ఓట్లు ఈ ఎన్నికల్లో ఇంకాస్త తగ్గినా కూడా ఆశ్చర్యం లేదు. అదే సమయంలో.. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూడాలని, జగన్ ప్రభుత్వాన్ని పతనం చేయాలని అనుకుంటున్న పవన్ కల్యాణ్ కోరికకు భారతీయ జనతా పార్టీ పెద్ద అడ్డంకిగా మారింది.
లోకల్ బిజెపి నాయకులు అడిగినా అడక్కపోయినా కూడా.. పవన్ తో తమ బంధం పటిష్టంగా ఉన్నదని, వచ్చే ఎన్నికల్లో ఇద్దరమూ కలిసి పోటీచేసి అధికారంలోకి వస్తామని చెబుతూ ఉంటారు. మాటలు చెప్తారే తప్ప.. వారి చేతల్లో కార్యక్రమాల్లో జనసేనకు వీసమెత్తు గౌరవం ఇచ్చినట్లుగా కనిపించదు. పైగా పవన్ ఆశిస్తున్న మేరకు వ్యతిరేక ఓటు చీలకుండా తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకోవాలనుకుంటే.. దాన్ని వారు పడనివ్వరు, కలిసి రారు.
ఈ నేపథ్యంలో బిజెపితో తెగతెంపులు చేసుకోవడానికి పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించిన సంకేతాలు కూడా బందరు సభలోనే వచ్చేశాయి. వారితో కటీఫ్ చెప్పడానికి పవన్ కల్యాణ్ ఈ సభలోనే ఒక నేపథ్యం క్రియేట్ చేశారు.
తెలంగాణలో తమ పార్టీని బిజెపి చిన్నచూపు చూస్తున్నదనే సంగతిని ఆయన బయటపెట్టారు. బిజెపి వారికి నేను ఎన్నికల ప్రచారం చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం నేను భారతీయుడిని. అదే అక్కడ ఎన్నికల్లో నా పార్టీ తరఫున కొందరు అభ్యర్థులు పోటీచేస్తారని అడిగినప్పుడు మాత్రం నేను ఆంధ్రోడిని అన్నారు. నేను ఆంద్రోడిని అయితే.. నా పార్టీ వారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేయడానికి కూడా కొన్ని సీట్లు ఇవ్వలేరా అంటూ పవన్ కల్యాణ్ బిజెపి తీరు మీద తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రకంగా బిజెపి సంకుచిత మనస్తత్వాన్ని పవన్ కల్యాణ్ ఎండగట్టారు. నిజానికి బిజెపి పవన్ కల్యాణ్ విషయంలో అదే అల్పబుద్ధిని ప్రదర్శిస్తోంది.
జనసేన అనే పార్టీ ఎన్డీయేలో భాగస్వామి అయినప్పుడు.. ఆ మర్యాదను వారు ప్రతిచోటా పాటించాలి. వారికి అసలు దిక్కూమొక్కూలేని ఏపీలో పవన్ మా మిత్రుడు అని చెబుతూ.. వారికి అంతో ఇంతో బలం ఉన్న తెలంగాణలో మాత్రం పవన్ కల్యాణ్ ను పక్కన పెట్టేస్తున్నారు. ఒకటిరెండు ఎమ్మెల్యే సీట్లు కాదు కదా, కనీసం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ సీట్లను పంచుకోవడానికి కూడా వారికి మనసు రావడం లేదు. వారు అంత సంకుచితంగా ప్రవర్తిస్తున్నప్పుడు తాను మాత్రం ఎందుకు పొత్తుల్లో కొనసాగాలి అనే ఆలోచన పవన్ కు కలిగినట్లుగా ఉంది. అందుకే బందరు సభలో ఈ నేపథ్యం ఏర్పాటు చేశారని పలువురు అనుకుంటున్నారు.
బిజెపితో కటీఫ్ కు నేపథ్యం క్రియేట్ చేసిన పవన్!
Thursday, November 14, 2024