బాస్ పార్టీ VS బావ మనోభావాల్.. ఏది గ్రేట్!

Thursday, November 14, 2024

ఇప్పుడు నలభైలు దాటిన వారందరికీ ఒకప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ సినిమాల మధ్య ఎలాంటి రైవలరీ ఉండేదో చాలా బాగా తెలుసు. ఒకే సారి ఇద్దరి సినిమాలు విడుదలైతే గనుక.. థియేటర్ల వద్ద యుద్ధ వాతావరణం ఉండేది. పోలీసు క్యాంపులు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. ఊర్లలో సినిమా పోస్టర్లు అంటిస్తే.. హీరోల పోస్టర్ల మీద ప్రత్యర్థి హీరో క్యాంపునకు చెందిన వాళ్లు పేడముద్దలు విసిరికొట్టడం చాలా రివాజుగా జరిగేది. హీరోల మధ్య వాతావరణం బాగానే ఉంటుంది గానీ.. ఫ్యాన్స్ మధ్య ఫ్యాక్షన్స్ ఉండేవనే చెప్పాలి.
కానీ క్రమంగా రోజులు మారుతూ వచ్చాయి. ఈ ఫ్యాన్స్ పిచ్చికంటె సినిమా వ్యాపారామే పెద్దపాత్ర పోషించడం మొదలైంది. సినిమా వ్యాపారం దెబ్బతినకుండా.. నిర్మాతలే పరస్పరం సహకరించుకోవడం.. పోటీగా కాకుండా.. విడివిడిగా ముందస్తు ప్లాన్ తో సినిమాలు విడుదల చేయడం జరుగుతూ వస్తోంది. అలాంటి నేపథ్యంలో చాలా చాలా గ్యాప్ తరువాత.. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాక్సాఫీస్ బొనాంజా నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు 2023 సంక్రాంతి విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు చిత్రాల మధ్య యుద్ధం లాంటి పోటీ వాతావరణం కనిపించడం లేదు గానీ.. ముందే చెప్పుకున్నట్టు 40లు దాటిన వారు అలాగే ఫీలవుతున్నారు.
ఈ రెండు చిత్రాల నుంచి రెండు ముఖ్యమైన పాటలు ఇప్పుడు ఆడియోలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన చిరంజీవి ‘బాస్ పార్టీ’, తమన్ కూర్చిన ‘మా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయే..’ పాటలు యూట్యూబ్ ను ఊపేస్తున్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది గ్రేట్? ఏది ఎక్కువగా ప్రజలకు రీచ్ అయింది.. ఎందుకు? అనే ప్రశ్నలు కూడా మనకు కలుగుతాయి.
యూట్యూబ్ వ్యూస్ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఆకట్టుకునే పాట బాణీ, అందులోని సాహిత్యం, చిత్రీకరణ పరంగా ‘బాలయ్య మనోభావాల్ దెబ్బతిన్నాయే’ పాటకే ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది. కొన్ని క్లిప్పులు మాత్రమే విడుదల అవుతాయి గనుక, చిత్రీకరణ అనేది ఈ దశలో డిసైడ్ చేయలేం. కానీ బాణీ, సాహిత్యం విషయాల్లో బాలయ్య మనోభావాలదే పైచేయి అని అంతా అనుకుంటున్నారు.
ఈ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ మీద తమన్ పైచేయి సాధించినట్టే. బాస్ పార్టీ పాటను స్వరపరచిన దేవిశ్రీ ప్రసాదే రాశారు. కానీ.. అదే ఏదో ట్యూన్ అనుకుని.. ఆ ట్యూనులో కొన్ని పదాలను వంకరటింకరగా పేరుస్తూ పోయినట్టే ఉన్నది తప్ప.. పాటలాగా హత్తుకునే సాహిత్యం అందులో లేదు. ‘మా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయే’ పాట సంగతి అలా కాదు. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాట సాహిత్యం కూడా ఐటెం సాంగ్ కు తగ్గట్టుగా ఉంది. ఏదో ఒక కంటెంట్ ను, మూడ్ ను ప్రేక్షకులకు అందించేలా ఉంది. బాస్ పార్టీకి సాహిత్యం మైనస్. ఇంకా చెప్పాలంటే బాస్ పార్టీకి మ్యూజిక్ కూడా మైనస్సే. స్పెషల్ సాంగ్ అనే కోణంలోంచి.. బాలయ్య పాటే ఎక్కువ ఆకట్టుకునేలా ఉంది. కానీ సినిమా అంటే కేవలం బాణీ, పాట మాత్రమే కాదు. చిత్రీకరణ కూడా కలిసి.. పాటలు సినిమాను నిలబెడతాయి. ఈ రెండు చిత్రాల్లోని ఈ రెండు పాటలు చిత్రీకరణ ఎలా సాగాయో.. విడుదలయ్యాక తేల్చాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles