తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇటీవల ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణలో రకరకాల కారణాల వలన ప్రాభవం తగ్గిన తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపిరి ఊదేదిశగా ఆయన ఖమ్మంలో సభ నిర్వహించారు. భారీ జనసమీకరణతో బాబు సభ గ్రాండ్ సక్సెస్ అయింది. కష్టపడి పనిచేస్తే తెలంగాణలో తెలుగుదేశానికి పూర్వవైభవం తీసుకురావడం కష్టమేమీ కాదని కూడా చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ఖమ్మం సభ అనూహ్యంగా సక్సెస్ కావడంతో.. తెలంగాణలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా సభలు నిర్వహించి.. తెలుగుదేశాన్ని బలోపేతం చేయడానికి వారిలో ఉత్సాహం వచ్చింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన భారత రాష్ట్రసమితి ఆవిర్భావ సభను ఖమ్మంలోనే నిర్వహించాలని అనుకోవడం, లక్షమంది జనాన్ని సమీకరించి సత్తా చాటాలనుకోవడం యాదృచ్ఛికం కాదేమో అనిపిస్తోంది. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు బలప్రదర్శన జరిగిన చోటనే.. అంతకంటె మిన్నగా బలప్రదర్శన చేయాలని కేసీఆర్ కదనకుతూహలం ప్రదర్శిస్తున్నట్టు అర్థమవుతోంది. ఇంకో రకంగా భారీ బహిరంగ సభ నిర్వహించడం ఓకే గానీ.. ఎర్రకోటపై గులాబీ జెండా రెపరెపలాడించాలని కలలుగనే జాతీయ పార్టీ ఆవిర్భావ సభ.. అనే చారిత్రాత్మక ఘట్టాన్ని ఖమ్మం లాంటి మారుమూల ప్రాంతంలో ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారనడానికి.. చంద్రబాబుకు కౌంటర్ బలప్రదర్శన తప్ప పెద్దగా కారణాలు కనిపించడం లేదు.
ఖమ్మంలో కొత్త కలెక్టరేట్ ను జనవరి 18న కేసీఆర్ ప్రారంభిస్తారు. అదేరోజు ఈ సభ జరుగుతుంది. సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ లను ఆహ్వానించారు. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల బలం కూడా బాగా ఉన్న నేపథ్యంలో అక్కడ నిర్వహించడం కలిసొస్తుందని కేసీఆర్ అంచనా.
ఖమ్మంలో అసలే పార్టీ పరిస్థితి బాగా లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తన వర్గం నాయకులను కూడా వెంటబెట్టుకుని మరీ పార్టీ మారుతారనే ప్రచారం ఉంది. ఇదే జరిగితే.. కనీసం 4-5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయావకాశాలపై ప్రభావం పడుతుందనేది ఒక అంచనా. అలాగే కేసీఆర్ పాత సహచరుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా పార్టీ మారుతారనే ప్రచారం ఉంది. ఆయన జిల్లా వ్యాప్తంగా ప్రభావం ఉన్న నాయకుడు. ఆయన పార్టీ మారితే గనుక.. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంతో కొంత ఓట్ల నష్టం ఉంటుందనేది విశ్లేషకుల భావన. ఇలాంటి నేపథ్యంలో ఖమ్మంలో భారాస బలహీనపడుతున్నదని అంతా భావిస్తున్న తరుణంలో.. అక్కడే భారాస ఆవిర్భావ సభ అత్యంత భారీ స్థాయిలో నిర్వహించడానికి కేసీఆర్ పూనుకోవడం అనేది వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు.