చంద్రబాబునాయుడు ప్రకటించిన తొలి విడత మేనిఫెస్టో ఫలితాలు చూడడానికి ఎన్నికలు పూర్తయ్యే దాకా ఆగాల్సిన అవసరం లేదు. ఆ ఫలితాలు ఇప్పుడే కనిపించేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఆ మేనిపెస్టోను ఎన్ని రకాలుగా ఎద్దేవా చేసినా.. ఆయనలో అది కాకపుట్టిస్తున్నది. జలజీవన్ మిషన్ కు సంబంధించిన పనులను రాష్ట్రంలో త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు ఆరాటపడుతున్నది.
కేంద్ర ప్రభుత్వం ఇంటింటికీ తాగునీటి వసతిని కల్పించేందుకు జలజీవన్ మిషన్ ను ప్రారంభించింది. ఇంటింటికి మరుగుదొడ్డి కోసం స్వచ్ఛభారత్ మిషన్ లాగానే తాగునీటికోసం జలజీవన్ మిషన్ అన్నమాట. అయితే కేంద్రప్రభుత్వ నిధులు ఏవి వచ్చినా.. ఏదో ఒక ఇతర అవసరాలకు మళ్లించేయడం అలవాటు అయిపోయిన ఏపీలో జలజీవన్ పనులు సక్రమంగా సాగలేదు. ఇటీవల ఆ పథకానికి సంబంధించిన కేంద్రప్రభుత్వపు కార్యదర్శి వచ్చి అమరావతిలో అధికార్లతో సమీక్ష కూడా నిర్వహించి వెళ్లారు.
ఇదొక ఎత్తు అయితే.. చంద్రబాబునాయుడు తన తొలి మేనిఫెస్టోలో ఇంటింటికీ తాగునీరు పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. జలజీవన్ మిషన్ పనులను తాను ఇంకా ఆలస్యం చేస్తే.. చంద్రబాబునాయుడుకు ఎడ్వాంటేజీ అవుతుందని జగన్మోహన్ రెడ్డి భయపడ్డారు. చంద్రబాబు ప్రకటించిన ఇతర పథకాలకు సంబంధించి, కౌంటర్ గా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన వద్ద ఆర్థిక వనరులు లేవు. జలజీవన్ మిషన్ అయితే.. కేంద్రంనుంచి నిధులు తెచ్చుకోవచ్చు. ఆ పథకం పేరు చెప్పి ఎన్నికల ప్రచారం సమయంలో చంద్రబాబు ఎడ్వాంటేజీ తీసుకోకుండా మేం ప్రారంభించేశాం అని చెప్పుకోవచ్చు.. అనే ఆలోచనతో దాని మీద పనులు వేగంగా చేయాలని అనుకుంటున్నారు.
చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టో వైఎస్సార్ కాంగ్రెస్ లో ప్రకంపనలు పుట్టిస్తోంది. తాజాగా కేబినెట్ భేటీలో కూడా జగన్ దీనిని పులిహోర మేనిఫెస్టోగా ఎద్దేవా చేశారు గానీ, వారి అంతరంగంలో ఆ హామీల పట్ల భయం మాత్రం పుష్కలంగా కనిపిస్తోంది. వాలంటీర్ల ద్వారా తెలుగుదేశం మేనిఫెస్టో మీద ప్రజల్లో స్పందన ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి, అప్రకటిత సర్వేలను కూడా చేయించడానికి జగన్ ప్లాన్ చేసినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిలో ఎన్నికలకు చాలా ముందుగానే కాకపుట్టించేశారు.
బాబు పుణ్యం.. సీఎం జగన్ లో కాక పుట్టింది!
Saturday, January 18, 2025