తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన హయాంలో జరిగిన అభివృద్ధి పనుల గురించిన ప్రస్తావన తెస్తేనే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుడుతున్నదా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన నాలుగేళ్లలో.. సంక్షేమం అనే ముసుగులో జనానికి డబ్బు పంచిపెట్టడం తప్ప.. అభివృద్ధి అనే నిర్వచనానికి ఒదిగే పనులేమీ చేసిన దాఖలాలు లేవు. ఖచ్చితంగా అందుచేతనే.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవ్వరైనా సరే ‘తాము చేసిన అభివృద్ధి’ అనే మాట అంటేనే సహించలేకపోతున్న వాతావరణం ఉంది. ఆ విషయం చంద్రబాబునాయుడు, నారా లోకేష్ విసురుతున్న సెల్ఫీ ఛాలెంజ్ లకు అధికారపార్టీ నాయకులు కంగారుపడుతున్న తీరును గమనిస్తే మనకు ఈ సంగతి అర్థమవుతుంది.
చంద్రబాబునాయుడు నెల్లూరులో పర్యటించి.. అక్కడి టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ దిగి ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు. ‘‘మేం లక్షల ఇళ్లు నిర్మించాం. మీరు ఎన్ని ఇళ్లు నిర్మించారు’’ అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దీనిపై సహజంగానే అధికారపార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు విపరీతంగా విరుచుకుపడడం మొదలైంది. చంద్రబాబును రకరకాలుగా దుమ్మెత్తి పోశారు. మేం వేల కొద్దీ జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చాం. వాటిలో చాలా మంది ఇళ్లు కట్టుకుంటున్నారు.. అని మంత్రులందరూ మాటలు చెబుతున్నారే తప్ప.. చంద్రబాబు లాగా.. జగనన్న ఇళ్లు, జగనన్న కాలనీలు పూర్తయి ఉంటే.. ఒక్కటంటే.. ఒక్కటైనా సెల్ఫీదిగి చంద్రబాబుకు కౌంటర్ చాలెంజ్ చేశారా అంటే అలాంటిదేం లేదు.
చంద్రబాబునాయుడు చాలెంజ్ కు కౌంటర్ విమర్శలు చేస్తున్న వారికి కామన్ సెన్స్ గానీ, ఇంగిత జ్ఞానం లేదనడానికి, అంతకంటె పెద్ద ఉదాహరణ ఏంటంటే.. చంద్రబాబునాయుడు ప్రారంభించిన టిడ్కో ఇళ్లు చాలా వరకు తమప్రభుత్వం వచ్చిన తర్వాతనే పూర్తయ్యాయని వారు అంటున్నారు. ఆ సంగతి నిజమే కావొచ్చు. కానీ.. జగన్ ప్రభుత్వం నిధులు కేటాయించి వాటిని పూర్తిచేసిందా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. చంద్రబాబు హయాంలో 90 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్ల ఫినిషింగ్ మాత్రమే కొత్త ప్రభుత్వం వచ్చాక జరిగింది.
పోనీ వారి మాటలే నిజం అనుకుందాం. జగన్ సర్కారు వచ్చిన తర్వాత.. లక్షల టిడ్కో ఇళ్లు పూర్తిచేశారనే అనుకుందాం. మరి.. ఈ లక్షల ఇళ్లలో ఎన్ని ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. ఈ నాలుగేళ్లలో ఎంత మంది పేదలు తమ సొంత ఇంటి కలను తీర్చుకుంటూ ఈ టిడ్కో ఇళ్లలోకి అడుగుపెట్టారు? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. చంద్రబాబు నిర్మించినవి గనుక.. టిడ్కో ఇళ్లు పూర్తయినా కూడా వాటిని ఒక్క లబ్ధిదారుడికి కూడా హేండోవర్ చేయకుండా జగన్ సర్కారు ఎంత దుర్మార్గంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదో అందరికీ తెలుసు. ప్రజల నోటిదాకా వచ్చిన టిడ్కో ఇళ్లను వారికి అందకుండా చేసిన ఘనత ఈ సర్కారుకే దక్కుతుంది. దుర్మార్గం తమవైపు ఉన్నదనే సంగతి కూడా మర్చిపోయి.. చంద్రబాబు చాలెంజ్ లకు కౌంటర్లు ఇస్తున్నవాళ్లు.. అర్థంపర్థం లేని మాటలు చెప్పడం, వంకర ప్రతివిమర్శలు చేయడం వారి పరువే తీసేలాగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బాబు ఛాలెంజ్ స్వీకరించలేక చేతగాని విమర్శలు!
Wednesday, January 22, 2025