కర్నూలుకు హైకోర్టు వస్తే ఏమవుతుంది? మూడు రాజధానులతో మాత్రమే మూడు ప్రాంతాల్లో సమాన అభివృద్ధి అనే బుకాయింపు మాటలు పదేపదే వల్లె వేస్తున్నారు గానీ.. ఎగ్జిక్యూటివ్ రాజధానితో విశాఖలో జరిగే అభివృద్ధీ, అసెంబ్లీతో అమరావతిలో జరిగే అభివృద్ధీ, హైకోర్టుతో కర్నూలులో జరిగే అభివృద్ధీ మూడూ సమానంగా ఉంటాయని వైసీపీ నాయకులు ఎవరైనా చెప్పగలరా? అసాధ్యం.ఈ మూడు ఊర్లూ.. మూడు రాజధానులు అయినంత మాత్రాన వీటిమధ్య హస్తిమశకాంతరం అంతటి తేడా ఉంటుంది.అయినా సరే వైసీపీ నాయకులు సమాన అభివృద్ధి అనే బుకాయింపు మాటలతో సభలు నిర్వహిస్తుంటారు.
వైసీపీ నాయకులు మూడురాజధానులకు ప్రజల మద్దతు ఉన్నదని నమ్మించడానికి చాలా కష్టపడి సభలు నిర్వహిస్తున్నారు. అలాంటిది కర్నూలులో కూడా బుగ్గన ఆధ్వర్యంలో నిర్వహించారు. షరామామూలే.. మూడురాజధానులకు జైకొట్టారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే బుగ్గన ఈ సభ సందర్భంగా ఒక మాట అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని అన్నారు. ఇంత అమాయకంగా బుగ్గన ఈ మాట ఎలా అంటున్నారో తెలియదు. ఎందుకంటే కేవలం కొన్ని రోజుల కిందటే.. చంద్రబాబునాయుడు కర్నూలు నడిబొడ్డులో నిల్చుని.. కర్నూలుకు హైకోర్టు రావాలన్నమాట అందరికంటె ముందు చెప్పింది నేను అని ఢంకా బజాయించి ప్రకటించారు. ఆ మాట బాబు చెప్పినప్పుడు బుగ్గనకు చెవులు వినపడ్డం లేదా? బధిరత్వం ఆవరించిందా? అనే సందేహం ప్రజలకు కలుగుతోంది. ఇప్పుడేదో ఇష్టమాకాదా అనే సవాలు విసురుతున్నారు.
అసలు విషయానికి వస్తే.. కర్నూలుకు హైకోర్టు అనే ప్రకటన చేయడం ద్వారా.. రాయలసీమను కొత్తగా తాము ఉద్ధరిస్తున్నట్టుగా వైసీపీ బిల్డప్ ఇచ్చుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. చంద్రబాబునాయుడు ఈ మాటను ఎన్నడో ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ విభజనకు ముందునుంచి కూడా.. కర్నూలులో హైకోర్టు పెట్టాలనే మాటను పదేపదే వినిపిస్తోంది. ఆ పార్టీలన్నీ ఎప్పటినుంచో చెబుతున్న మాటనే.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. జగన్ రెడ్డి కొత్తగా వినిపించారు. ఆయన కొత్తగా జత చేసిన పాయింట్ ఏంటంటే.. ‘‘చీఫ్ జస్టిస్ తో కూడిన హైకోర్టు’’ అని మాత్రమే అన్నారు. అందరూ చెప్పే హామీని కాస్త మార్చి.. రాయలసీమను ఉద్ధరించడానికి తాను కొత్త ఆలోచన చేసినట్టుగా చెప్పుకుంటున్నారు.
ఇదంతా పెద్ద మోసం. వంచన. హైకోర్టుతో ఒరిగేదేమీ ఉండదు. ఈ వాస్తవాలన్నీ మరుగున పెడుతూ.. బుగ్గన రాజేంద్రనాధ రెడ్డి.. చంద్రబాబు వ్యతిరేకమా? అనుకూలమా? అంటే ఆ మాట కామెడీ కాక మరేమిటి? ఇలాంటి మాటలను ప్రజలు గమనిస్తే నవ్విపోతారని ఆయనకు తెలియదా?