బస్సు రాజకీయం తుస్సుమంటుందా?

Sunday, December 22, 2024

కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో జనగర్జన సభను కనీ వినీ ఎరుగని స్థాయిలో చాలా ఘనంగా నిర్వహించాలని అనుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సాగిస్తున్న పాదయాత్ర ముగింపు సభ గా ఆదివారం నాడు సాయంత్రం ఆ సభ జరగనుంది. అదే సభలోనే ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్, కీలక నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరబోతున్నారు. తొలుత భట్టి పాదయాత్ర ముగింపు, పొంగులేటి చేరిక లకు వేర్వేరు సభలు నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఏఐసీసీ పూనికతో ఒకే సభ జరుగుతోంది. ఈ సభద్వారా ఖమ్మం జిల్లాలో తన ప్రాభవం ఏంటో చూపించాలని పొంగులేటి ఉత్సాహపడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెసు నాయకుల మాటలు గమనిస్తోంటే.. ఈ సభను విఫలం చేయడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది.

ఖమ్మంలో జరిగే బహిరంగసభకు వివిధ ప్రాంతాలనుంచి జనసమీకరణ నిమిత్తం ఆర్టీసీ వారిని 1500 బస్సులు అద్దెకు కేటాయించాల్సిందిగా కాంగ్రెసు కోరిందిట. అందుకు రెండుకోట్ల రూపాయలు చలానగా చెల్లించాలని ఆర్టీసీ వారు పేర్కొని, బస్సులు ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నారట. తీరా, డబ్బుతో చలానా కట్టడానికి వెళ్లే సమయానికి ఒక్క బస్సు కూడా ఇవ్వడానికి కుదరదంటూ ఆర్టీస అధికారులు తేల్చి చెప్పేశారట. ఈ విషయాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ లో వెల్లడించారు. కాంగ్రెస్  సభకు జనం రాకుండా అడ్డుకోవడానికి ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఖమ్మంలో తమ సభకు లక్షలాది మంది జనం హాజరవుతున్నారని, జనం రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని కూడా పొంగులేటి హెచ్చరించారు.

పనిలో పనిగా ఆయన కేసీఆర్ ను, ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో దునుమాడారు. ఆర్టీసీ అనేది ప్రజల సంస్థ అని, కేసీఆర్ తాతగారిది గానీ, ఆర్టీసీ మంత్రి తండ్రి గారిది గానీ కాదని ఎద్దేవా చేశారు. అసలే నష్టాల్లో ఉన్న సంస్థకు తాము రెండు కోట్ల రూపాయల బిజినెస్ ఇస్తోంటే ప్రభుత్వం కుట్రపూరితంగా కాలదన్నుతోందని అన్నారు.

బస్సులు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుపుల్ల వేసింది సరే. కానీ, తద్వారా జనం రాకుండా అడ్డుకోవడం సాధ్యమేనా? ఇప్పుడే బస్సులు రావడం లేదని తేలడం వల్ల, కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకుండా ఉంటుందా? అనేది ప్రశ్న. ప్రత్యర్థి పార్టీల సభలకు బస్సులు ఇవ్వకుండా వారి సభ పట్ల బెదిరిపోయారనే అపకీర్తి మూటగట్టుకోవడం తప్ప.. ఈ చర్య ద్వారా భారాస సాధించే ప్రత్యేకమైన విజయం ఏమైనా ఉన్నదా? అని జనం సందేహిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles