రాజకీయాల్లో ఒక్కోసారి ఒక్కో నినాదం చాలా బలంగా ప్రజల్లోకి వెళుతుంది. అది పనిచేస్తుందా లేదా తర్వాతి సంగతి! కానీ బాగా పాపులర్ అవుతుంది. ఆ రకంగా చూసినప్పుడు.. ఈసారి కూడా ఎన్నికల కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చాలా కాలంగా అంటున్న నినాదం బాగా పాపులర్ అవుతోంది. ఆ నినాదమే ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అనేది!
నినాదాలు రాజకీయాల్లో పార్టీలకు ఆయువుపట్టు లాంటివి. ‘జై జవాన్ జై కిసాన్’ లాంటి ఆల్ టైం గ్రేట్ నినాదాలు కూడా మనకు పార్టీలు పుట్టించినవే. ఇటీవలి ఏపీ రాజకీయాలకు సంబంధించినంత వరకు ప్రతి ఎన్నికల్లోనూ ఒక నినాదం పాపులర్ అవుతోంది. ఫలితం ఇస్తోంది కూడా.
2014 ఎన్నికల్లో ‘బాబు వస్తేనే జాబు వస్తుంది’ నినాదం ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. పారిశ్రామికీకరణ, పరిశ్రమలు తీసుకురాగల నేర్పు,పెట్టుబడులను రాబట్టే అనుభవం.. ఇత్యాది విషయాల్లో చంద్రబాబునాయుడు పనితీరు మీద అప్పటికే ప్రజల్లో ఓ అభిప్రాయం ఉన్నది గనుక.. 2014 ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయి, అనాథలా కొత్తగా ఏర్పడుతున్నదనే సమయంలో.. ‘బాబు వస్తేనే జాబు వస్తుంది’ అనే నినాదం పనిచేసింది. చంద్రబాబు వస్తే అభివృద్ధి మార్గంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పలువురు ఆశించారు. అదే 2019 ఎన్నికలు వచ్చేసరికి జగన్ నినాదమే ఎక్కువ పాపులర్ అయింది. ‘కావాలి జగన్.. రావాలి జగన్’ అనే నినాదం ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. నిజానికి ఈ నినాదంలో జగన్ అనుకూల వైఖరి తప్ప.. ప్రజలకు ఇచ్చిన హామీ ఏం లేదు. కంటెంట్ ఏమీ లేదు. కానీ, పాటలు గట్రా మీడియా ద్వారా ఆ నినాదాన్ని పాపులర్ చేశారు.
2024 ఎన్నికలు వచ్చేసరికి అన్ని పార్టీలు ఏదో ఒక నినాదాన్ని తయారు చేసుకుంటాయి. అయితే తెలుగుదేశం పార్టీ.. గత చాన్నాళ్లుగా తమ అవస్థలు చెప్పుకోవడానికి తయారు చేసుకున్న నినాదం.. ‘సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలి’ అనేది! ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకోవడానికి తయారుచేసిన నినాదమే కాకపోయినప్పటికీ.. అది అప్పుడే ప్రజల్లోకి వెళ్లిపోయింది. ‘నిజమే కదా’ అనిపించేలాగా.. ప్రభుత్వం తీసుకుంటున్న అనేకానేక నిర్ణయాలు ప్రతిపక్షాలను వేధించడానికే చేస్తున్నారా అనే అభిప్రాయం కూడా ప్రజలకు కలుగుతోంది. అధికారంలో ఉన్న పార్టీ నిబంధనల అతిక్రమణ, అరాచకత్వం, స్థానికంగా దందాలు ఏది ప్రజల దృష్టికి వచ్చినా.. వారికి వెంటనే ఈ నినాదమే గుర్తుకు వస్తోంది. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అంటూ చంద్రబాబునాయుడు ప్రతి చోటా ప్రస్తావిస్తూ.. జగన్ వ్యతిరేక ఆలోచనలకు ప్రజల్లో పాదుగొల్పుతున్నారు. ఇది ఎలా పనిచేస్తుందో ఎన్నికలసమయానికి తేలుతుంది.
బలపడుతున్న నినాదం.. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’!
Thursday, November 14, 2024