బడ్జెట్ సమావేశాల్లో 3 రాజధానుల బిల్లు అసాధ్యం

Monday, December 23, 2024

వచ్చేనెలలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చిట్టచివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. వచ్చే ఏడాది ఎన్నికలు ముంచుకొచ్చేస్తాయి గనుక పూర్తి బడ్జెట్ పెట్టే అవకాశం లేదు. కాబట్టి ఈ ఏడాది పెట్టే బడ్జెట్లో బీభత్సంగా వరాలు, గణాంకాల ఇంద్రజాలం అన్నీ కనిపిస్తాయి. వేలకు వేల కోట్ల రూపాయల సంక్షేమం వెల్లువలా కనిపిస్తుంది. కాబట్టి బడ్జెట్ గురించి పెద్దగా మాట్లాడుకోనక్కర్లేదు. అది ఎటూ ఆకర్షణీయంగానే ఉంటుంది. కాకపోతే ఈ అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందుకు వస్తాయని ప్రచారంలో ఉన్న బడ్జెటేతర అంశాల గురించి చర్చ జరుగుతోంది.
ఈ బడ్జెట్ సమావేశాలలో జగన్ సర్కారు మూడురాజధానుల బిల్లును మళ్లీ ప్రవేశపెడుతుందనే ప్రచారం ఉంది. గతంలో ఆ చట్టాన్ని వెనక్కు తీసుకున్నప్పుడు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా మరింత పటిష్టంగా చట్టం రూపొందించి పెడతామని జగన్ అన్నారు. అప్పటినుంచి మూడురాజధానులు ఇదిగో అదిగో, విశాఖ పాలన రేపటినుంచే ఎల్లుండినుంచే అని వైసీపీ నాయకులు రకరకాలుగా ఊదరగొడుతూనే ఉన్నారు. అలాంటి ప్రచారాల వల్ల ఈ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు వస్తుందనే పుకార్లు పుట్టాయి.
అయితే, విశ్లేషకులు చెబుతున్న దాన్ని బట్టి ఈ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు అసాధ్యం. అసలు మూడు రాజధానులుగా చేసే అధికారమే రాష్ట్ర ప్రభుత్వానికి లేదనే స్పష్టత వారికి వచ్చింది. నాయకులు ఏమైనా చెప్పొచ్చుగానీ.. ఇప్పట్లో బిల్లుమాత్రం సభ ఎదుటకు రాకపోవచ్చు.
అసలు రాజధానులను నిర్ణయించుకునే/ మార్చుకునే అధికారం రాష్ట్రప్రభుత్వాలకు ఉండేలా మరింత స్పష్టత ఇస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఒక ప్రెవేటు మెంబర్ బిల్లు పెట్టారు. తద్వారా.. అలాంటి అధికారం ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వానికి లేనేలేదని ఆయన స్పష్టంచేశారు. అలాంటి నేపథ్యంలో ఒకసారి దూకుడుగా వెళ్లి మూడురాజధానుల చట్టం చేసి.. హైకోర్టులో సుదీర్ఘకాలం వాదనలకోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత.. ప్రభుత్వం పరాజయం పాలైంది. తల బొప్పి కట్టింది. సీఆర్డీయే రద్దు బిల్లును కూడా వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి పరువుపోయేలా.. అంత తేలిగ్గా జగన్ సర్కారు ఇంకోసారి మూడు రాజధానుల బిల్లు తేకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles