రాష్ట్ర నాయకత్వంలో మార్పు వలన.. ఎలాంటి అసంతృప్తులు లేవని, ఆ పరిణామం పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపించకపోవచ్చునని తెలంగాణలో బిజెపి చాటిచెప్పడానికి ప్రయత్నించింది. పదవినుంచి దిగిపోయిన బండి సంజయ్, కొత్త సారథి కిషన్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. కిషన్ రెడ్డిని, బండి సంజయ్ ఘనంగా సత్కరించారు కూడా. అయితే.. పార్టీ కేడర్ లో కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా పనిచేయడానికి బిజెపి ఇంకో వ్యూహం అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. బండి- కిషన్ పదవుల మధ్య కుండమార్పిడి అందుకు మార్గంగా వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కేంద్ర కేబినెట్ విస్తరణకు అంతా రంగం సిద్ధమైంది. తెలంగాణ సహా మరికొన్ని నెలల్లో జరగాల్సి ఉన్న అయిదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు, వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు లక్ష్యంగా ఈ కేబినెట్ విస్తరణ జరగబోతున్నది. అదే సమయంలో బిజెపిలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సిద్ధాంతం ఎప్పటినుంచో అమల్లో ఉంది. ఇప్పుడు కిషన్ రెడ్డి కోసం ఆ నియమాన్ని వారు ప్రత్యేకంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి.. కిషన్ రెడ్డిని కేబినెట్ నుంచి తప్పించి.. ఆ స్థానాన్ని బండి సంజయ్ తో భర్తీ చేసే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర పార్టీని ఎన్నికలకు సిద్ధంగా ఉంచే ఉద్దేశంతో కిషన్ కు సారథ్యం ఇచ్చినా, బండిని పక్కకు తప్పించి పూర్తిగా ఖాళీగా ఉంచడం వల్ల పార్టీకి చేటు అని హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం.
కులాల సమీకరణల పరంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, రాజకీయ ప్రత్యర్థులు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారని కూడా వారు భావిస్తున్నారు. పైగా బండి సంజయ్ రాష్ట్ర నాయకత్వం నిర్వహించిన సమయంలో.. తనదైన వర్గాన్ని తయారు చేసుకున్నారు. ఆయనకు సొంతంగా కూడా గట్టి అనుచర గణం ఉంది. పదవి పోయిన తర్వాత.. ఢిల్లీనుంచి హైదరాబాదు వచ్చిన బండికి ఎయిర్ పోర్ట్ లో ఎంతో ఘనస్వాగతం లభించింది. అనుచరులు ఆయనను భుజాలమీదికి ఎత్తుకుని ఊరేగించారు. ఆ సంరంభం చూస్తే.. పదవి పోయిన నేతలాగా కాదు.. పదవి సాధించిన నేతకు స్వాగతం లాగా అనిపించింది. ఇదే ఎయిర్ పోర్ట్ లో బండి సంజయ్ పార్టీ నాయకులు బూర నర్సయ్య గౌడ్, గూడూరు నారాయణ రెడ్డిలతో ఏకాంతంగా చాలా సేపు సమావేశం అయ్యారు. ఈ హడావుడి మొత్తం పార్టీలో ఆయనకున్న బలాన్ని తెలియజెబుతోంది. ఇలాంటి నాయకుడికి అసంతృప్తి కలిగించి.. కొత్త చిక్కులు కొనితెచ్చుకోవడం బిజెపికి ఇష్టం ఉండకపోవచ్చు. అందుకే ఆయనకు ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి కట్టబెడతారనే ప్రచారం ఉంది.