ఆయన రెచ్చిపోయి స్వచ్ఛమైన తెలంగాణ యాసలో, సభారంజకమైన నిందలు, చివరి మోతాదు వరకు వెళ్లని బూతులతో కేసీఆర్ సర్కారు మీద విరుచుకు పడినంత కాలమూ.. వారు ఆయనను చాలా గొప్పగా చూసుకున్నారు. ఆ పార్టీలో చాలామందికి అలవాటులేనంత దూకుడు ఆయన ప్రదర్శిస్తూ ఉంటే.. తమను బైపాస్ చేసి దూసుకెళ్లిపోతాడేమో అని అసూయ పడ్డారే తప్ప, ఆయనతో సమానంగా స్పీడు పెంచుకున్న వాళ్లు లేరు. తీరా ఇప్పుడు ఆయన దూకుడు ఆయనకు ముప్పుగా మారిన సమయంలో వెంట నిలుస్తున్న వాళ్లు ఎందరు? అనే ప్రశ్న తలెత్తుతోంది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్.. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఏ1గా అరెస్టు అయ్యారు. బిజెపి శ్రేణులు ఆయన అరెస్టు, తరలింపు, కోర్టు వద్ద విచారణ తదితర సందర్భాల్లో బాగానే రచ్చ రచ్చ చేస్తున్నాయి. కానీ.. అసలైన కీలక నాయకులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారా అనే అభిప్రాయం కలుగుతోంది. కొందరు నేతల మౌనం గమనిస్తే.. పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి దొరికిపోవడం పార్టీ పరువు తీస్తుందని వారు భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది.
బండి అరెస్టు నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల గురించి హస్తినలోని పెద్దలు ఆరాతీస్తూ ఉన్నారే తప్ప.. కీలక ప్రకటనలేమీ చేయలేదు. ఎలా ముందడుగు వేయాలో ఇంకా ఇదమిత్థంగా తేల్చుకోలేకపోతున్నారు. తీరా బండిని సమర్థిస్తూ ఘాటుగా పోరాటంలోకి దిగేస్తే, ఆ తర్వాత ఆయన తప్పు చేసినట్టుగా తేలుతుందేమోనని వారి భయం. అలా జరిగితే పార్టీ పరువు సాంతం మంటగలిసిపోతుందని భయపడుతున్నారు. బండి సంజయ్ ఇన్నాళ్లూ రాష్ట్రపార్టీ అధ్యక్షుడిగా ఒంటెత్తు పోకడలు అనుసరించారనే విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో రాష్ట్ర నాయకులు కూడా ఆయన అరెస్టు విషయంలో మొక్కుబడిగానే స్పందిస్తున్నారు.
బండి పాదయాత్ర, కేసీఆర్ మీద, ఆయన కుటుంబం మీద తీవ్రమైన విమర్శల నేపథ్యంలో ప్రధాని మోడీ కూడా చాలా సంబరడినట్టు, ఆయన కష్టాన్ని ప్రత్యేకంగా అభినందించినట్టు గతంలో వార్తలు వచ్చాయి. కానీ అలాంటి వాళ్లంతా ఇప్పుడు పేపర్ లీకేజీ కేసులో చిక్కుకున్న బండికి అండగా నిలిచేలా కనిపించడం లేదు. చూడబోతే.. బండి సంజయ్ బిజెపికి ఇప్పుడు గుదిబండగా మారుతున్నారా అని పలువురు భావిస్తున్నారు.
బండి.. బిజెపికి గుదిబండగా మారుతున్నాడా?
Tuesday, November 5, 2024