బండితో పాటు సోమును కూడా మారుస్తారా?

Saturday, January 18, 2025

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సారథి బండి సంజయ్ ను మారుస్తారనే వార్తలు ముమ్మరంగా వస్తున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ లో బిజెపి సారథి సోము వీర్రాజును కూడా మారుస్తారా అనే చర్చ మొదలైంది. సోము వీర్రాజు నాయకత్వంపై కూడా చాలా కాలంగా నాయకుల్లో అసంతృప్తి ఉంది. అక్కడ సారథ్యం అందుకోవలనే కోరిక కొందరు నాయకుల్లో ఉంది. ఈ నేపథ్యంలో.. సోము వీర్రాజు మార్పు గురించి కూడా అసమ్మతి వర్గం పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

బండి సంజయ్ ను మార్చే పరిస్థితి వస్తే గనుక.. ఏపీలో సోము వీర్రాజును కూడా మార్చి కొత్త నాయకుడికి సారథ్యం అప్పగించడం భారతీయ జనతా పార్టీ అధిష్ఠానానికి మంచిది. ఎందుకంటే.. రాష్ట్ర చీఫ్ ల మార్పును పార్టీ విధాన నిర్ణయంగానే తీసుకున్నాం తప్ప.. బండి సంజయ్ ను ప్రత్యేకంగా టార్గెట్ చేయలేదని.. వారు ప్రజల్లోకి సంకేతాలు పంపడానికి వీలవుతుంది. లేకపోతే.. బండి మీద ఆయన అసమ్మతి వర్గం వారు చేసిన ఆరోపణలను మాత్రం అధిష్ఠానం నమ్మినట్లుగా ప్రజలు అనుకుంటారు. అదొక్కటే కాకుండా.. ఏపీలో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయడం కూడా కొత్త నాయకత్వంతో సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వినవస్తున్నాయి.

సోము వీర్రాజు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ తో కుమ్మక్కు అయి.. వారి పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారనే ఆరోపణలు తొలినుంచి ఉన్నాయి. తదనుగుణంగా ఆయన ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారనే వాదన ఉంది. ఇదే విషయాన్ని పలువురు కాషాయ నేతలు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే నాయకత్వంతో ఎన్నికలకు వెళ్లాలంటే.. బిజెపికి పరువుపోవడం తప్ప లాభం లేదు. అదే సమయంలో.. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని గరిష్టంగా ఎంపీ సీట్లను దక్కించుకుని బిజెపి రంగంలోకి దిగుతుందని విశ్లేషణలు వినవస్తున్న నేపథ్యంలో.. చంద్రబాబుతో స్నేహపూర్వకంగా మెలగగల నాయకుడే బిజెపి చీఫ్ గా ఉంటే బాగుంటుంది. సోము వీర్రాజు ఇటీవలి కాలంలో.. చంద్రబాబు మీద మాటల దూకుడు తగ్గించారు తప్ప.. అంతకు ముందు వరకు, జగన్ విఫలమయ్యారని ఆయన విమర్శించిన ప్రతి సందర్భంలోనూ దానికంతటికీ కారణమే చంద్రబాబునాయుడు అయిదేళ్ల పాలనే అని తిట్టిపోసేవారు. అధిష్ఠానం ఆదేశిస్తే.. పార్టీ తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకున్నా.. సోము వీర్రాజు ఆ స్నేహబంధంలో చాలా మొక్కుబడిగా మాత్రమే వ్యవహరించగలరు. ఇలాంటి నేపథ్యంలో.. సోము వీర్రాజును మార్చడమే బిజెపికి లాభం కలిగిస్తుంది. పైగా సత్యకుమార్ వంటి యువ నాయకులు రాష్ట్ర సారథ్యం అందుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. బిజెపి ఒకేసారి రెండు రాష్ట్రాల గురించి నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles