విశాఖకు ప్రధాని వస్తున్నారు. ప్రధానిని ఎప్పుడు ఎక్కడ కలవాల్సి వచ్చినా సరే.. ఆయన ముందు మోకరిల్లి పాదాలను స్పృశించి తరించడానికి ఆరాటపడే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తన సొంత రాష్ట్రానికి, అది కూడా రాజధానిగా తాను కలగంటున్న ప్రాంతానికి ప్రధాని మోడీ వస్తోంటే ఇంకెంతగా ఆరాటపడతారో కదా? ఇప్పుడు విశాఖలో అదే కనిపిస్తోంది. ప్రధాని సభకు భారీగా జనసమీకరణ చేయడానికి వైసీపీ శ్రేణులు పూనకం తెచ్చుకుని పనిచేస్తున్నాయి. మరోవైపున ప్రధానికి ఒక్క నిరసన గళం కూడా వినిపించకుండా తొక్కేయడానికి కూడా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ తనకు జేజేలు కొట్టడమే తప్ప.. నిరసన గళం సహించలేని ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు.
విశాఖ ఉక్కు ప్రెవేటీకరణకు సంబంధించి ఆ ఆలోచనను వెనక్కు తీసుకోవాలంటూ.. 635 రోజులనుంచి స్థానికులు దీక్షలు చేస్తున్నారు. ఎంతో తీవ్రమైన పోరాటాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును వదులుకునేది లేదని అంటున్నారు. సాధారణంగా మరొకచోట అయితే ప్రధాని వచ్చే రోజున విశాఖ ఉక్కు తాలూకు నిరసనలు మిన్నంటేవి. కానీ విశాఖ వాసులు చాలా మర్యాదస్తులు కాబట్టి, లేదా ప్రభుత్వం ఆంక్షలు విధించే నేపథ్యంలో అది సాధ్యం కాకపోవచ్చుననే ఆలోచన ఉన్నవారు కాబట్టి.. రెండు రోజుల ముందుగా చిన్న కార్యక్రమం చేపట్టారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రెవేటీకరణకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ తలపెట్టారు. అయితే పోలీసులు ఈ ర్యాలీని అడ్డుకుని 200 మందిని అరెస్టు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రధాని రాకముందే.. ప్రజల మీద రాష్ట్రప్రభుత్వం కత్తి దూస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశాంతంగా చేపడుతున్న బైక్ ర్యాలీని అడ్డుకోవడం.. అరెస్టులకు పాల్పడడం పట్ల ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ప్రధానిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన గుడ్ లుక్స్ లో ఉండడానికి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలను దూరం చేసుకుంటారా? అని అంటున్నారు. ప్రజలకు మద్దతుగా కార్మికుల పక్షాన కేంద్రం పై ఒత్తిడి తేవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలనే అరెస్టులు చేస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి.
వైఎస్సార్ సీపీ శ్రేణులు మాత్రం పూర్తిగా ప్రధాని సభకు జనసమీకరణ చేయడంలోనే తలమునకలై ఉన్నాయి. ప్రధాని సభను సక్సెస్ చేయాలనే ఆరాటం.. కమలదళం కంటె అతిగా వైసీపీ దళాలలోనే కనిపిస్తోంది. ఇంత వల్లమాలిన ప్రేమను కనబరచడం ఏ రాజకీయ భవిష్య పరిణామాలకు సంకేతమో తెలియదు గానీ.. మొత్తానికి వైసీపీ ప్రధాని సభ కోసం తమ శక్తియుక్తులన్నీ ఒడ్డుతోంది.