బీహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పదవి ఉంటుందా? ఊడుతుందా? ఇప్పటికిప్పుడు ఆయన పదవికి వచ్చిన ఢోకా ఏమీ లేదా గానీ.. ఆయన క్రెడిబిలిటీని దారుణంగా దెబ్బతీసే విమర్శలు ఇప్పుడు పోటెత్తుతున్నాయి. ఒకప్పట్లో ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడైన సహచర నాయకుడిగా చెలామణీ అయి, నితీశ్ వారసుడు కూడా కాగలడని ప్రచారంలోకి వచ్చినా.. ఆ తరువాత శత్రువుగా మారిపోయిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. నితీశ్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇం.డి.యా. కూటమిలోకి మరిన్ని పార్టీలను తీసుకువచ్చి ఆ కూటమిని బలోపేతం చేయడం ఒక్కటే సింగిల్ పాయింటె ఎజెండాగా ముందుకు సాగుతున్న నితీశ్ కుమార్.. ఇండియా కూటమి విజయం ద్వారా తానేమీ ఆశించడం లేదని పదేపదే అంటున్నారు. ఆయన ఎంతగా కాదంటున్నా సరే.. ఆయన పేరు ఖచ్చితంగా ప్రధాని పదవి రేసులో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా.. నితీశ్ కుమార్ క్రెడిబిలిటీ పూర్తిగా దెబ్బతినే ప్రకటన ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ చేశారు.
నితీశ్.. పైకి ఎన్ని మాట్లాడుతున్నప్పటికీ.. భారతీయ జనతా పార్టీతో మంతనాలు సాగించడానికి ఇంకా తలుపులు తెరచుకునే ఉన్నారని పీకే వ్యాఖ్యానించారు. జేడీయూకు చెందిన ఎంపీ హరివంశ్, రాజ్యసభకు ఇంకా డిప్యూటీ ఛైర్మన్ గా కొనసాగుతుండడాన్ని ఉదాహరణగా చూపించి.. భాజపా- జేడీయూ కుమ్మక్కు రాజకీయాలుగా ఆయన అభివర్ణిస్తున్నారు. ప్రతి బిల్లు లోక్ సభ, రాజ్యసభల్లో కూడా ఆమోదం పొంది తీరాల్సి ఉన్న నేపథ్యంలో.. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ సభలో బలం లేని భాజపా అక్కడ బిల్లులు ఆమోదింపజేసుకోవడం కష్టం. ఈ నేపథ్యంలో జేడీయూ కు చెందిన హరివంశ్ ఇంకా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా ఉండడం వలన బిజెపి అక్కడ బిల్లులు నెగ్గించుకుంటోందని ఆరోపించారు. ఆయన ద్వారా బిజెపితో బేరసారాలకు నితీశ్ కు ఇంకా సమయం ఉన్నదని ఆయన చెబుతున్నారు.
ఇండియా కూటమిలోకి అనేక పార్టీలను సమీకరించడం ద్వారా.. బలోపేతం చేసే బాధ్యత ప్రధానంగా నితీశ్ చూస్తున్నారు. ఇప్పటికి మూడో భేటీ జరుగుతుండగా.. ఇంకా కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నారా? అనే ప్రశ్నకు అవునని నితీశ్ చెబుతున్నారు. అన్ని పార్టీలతో సత్సంబంధం వలన స్క్రాప్ నుంచి కూటమిని నిర్మించుకుంటూ వచ్చారు. కాలం కలిసొస్తే ప్రధాని అయిపోగలనని ఆయన నమ్మకం. అయితే.. ప్రశాంత్ కిశోర్ మాత్రం .. నితీశ్ కు ప్రజలు చెక్ పెట్టేలాగా మాటలు రువ్వుతున్నారు. ఈ పరిణామాలుఎక్కడిదాకా దారితీస్తాయో చూడాలి.