ప్రతీకారం తీర్చుకోవడం లో పరువు తీసే అడుగులు!

Wednesday, January 22, 2025

రాజకీయంగా తమ మీద విమర్శలు గుప్పించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎవరైనా అనుకుంటారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇందుకు అతీతంగా ఎంత మాత్రమూ కాదు. పగలు ప్రతీకారాల నవతరం రాజకీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ వారు కూడా అనేక చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే తాజా పరిణామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ధిక్కారస్వరం వినిపించిన నేతలపై పాలక పక్షం అనుసరిస్తున్న ధోరణి, చేపడుతున్న ప్రతీకార చర్యలు వారి పరువు తీసే మాదిరిగానే ఉన్నాయి.
నెల్లూరు జిల్లాలో ప్రస్తుతానికి ఇద్దరు ఎమ్మెల్యేలు వైయస్సార్ పార్టీ నుంచి జారిపోయినట్టే! ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. సుదీర్ఘకాలం నుంచి సుతి మెత్తగా ప్రభుత్వ పరిపాలన గురించి, పార్టీ వ్యవహారాల గురించి చురకలు అంటిస్తూవస్తున్న సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి ఒకరైతే, తాజాగా ఒక్కసారిగా తెర మీదకు వచ్చి పెనుగాలిలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద విరుచుకుపడుతున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరొకరు.
వారిద్దరూ ద్రోహులని, దుర్మార్గులని, పార్టీకి వెన్నుపోటు పొడిచారని అధికార పార్టీ నుంచి అనేక మంది నాయకులు దుమ్మెత్తిపోయడం జరుగుతోంది. ఇంతవరకు ప్రజలు అర్థం చేసుకుంటారు. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోతున్న నాయకులపై ఆ మాత్రం విమర్శలు రాకుండా ఎందుకు ఉంటాయి అని నమ్ముతారు. ఇదంతా ఓకే కానీ, ప్రభుత్వపరంగా తీసుకుంటున్న ప్రతీకార చర్యలే వారి పరువు తీసేవిధంగా కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నాయకులు కూడా ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ప్రభుత్వం మీద ధిక్కారస్వరం వినిపించిన వెంటనే వారి భద్రతను కుదిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఇదేదో తమాషాగా నడిచే చిన్నపిల్లల ఆటలాగా ఉంది. ‘నువ్వు నా జట్టులో లేవు కాబట్టి నీకు బెల్లం ముక్క పెట్టను’ అని పసిపిల్లలు ఆటల్లో మారం చేసినట్టుగా ఉంది. సర్కారు మీద నిందలు వేసిన వెంటనే భద్రత తగ్గించడం విమర్శలకు గురవుతోంది.
వారి ప్రతీకారం ఎంత సహజమో.. ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలను వీలైనంతగా తమ మైలేజీ కోసం వాడుకోవడానికి ఆ నాయకులు ప్రయత్నించడం కూడా అంతే సహజం.
ఆనం రామనారాయణరెడ్డి ఆల్రెడీ ఇలాంటి ప్రచారాన్ని మొదలెట్టారు.తనకు భద్రత తగ్గించడం ద్వారా తన హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. నేడో రేపో కోటంరెడ్డి నుంచి కూడా ఇలాంటి మాటలు వస్తాయి. తనకు ఆల్రెడీ కడప నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్టుగా కోటంరెడ్డి చెబుతున్నారు. ఇలాంటి సమయంలో భద్రత తగ్గించడం అనేది చర్చనీయాంశమే! ఏదైనా ఒక సంఘటన జరిగినా కూడా ఆశ్చర్యం లేదు. ధిక్కార స్వరం వినిపించిన నాయకులకు, విపక్ష పార్టీలకు అది అడ్వాంటేజీగా మారినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి సంభావ్యతలన్నీ చాలా సాధారణమైనవే. అందరూ ఊహించదగినవే. అయినప్పటికీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రం భద్రత తొలగించడం వంటి లేకి ప్రతీకార చర్యలకు ఎందుకు పాల్పడుతుంది అనేది ఊహకందని సంగతి!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles