ప్రతిపక్ష పార్టీలు రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయని అంటే.. పాలకపక్షం భయపడడంలో అర్థముంది.ప్రతిపక్షాల పీకనొక్కాలని, వారి గళం వినిపించకుండా చేయాలని ఆంక్షలు విధించడం అనేది,పోలీసు బలగాలతో ఆటంకాలు సృష్టించడం అనేది రాష్ట్రంలో చాలా కామన్ విషయంగా అందరికీ అలవాటు అయిపోయింది. అయితే కనీసం ప్రతిపక్షాలు ఏదైనా మంచి పని చేయడానికి కూడా వీల్లేదంటే ఎలా? ప్రతిపక్షాలు సేవా కార్యక్రమాలు కూడా చేయనివ్వకుండా అడ్డుకుంటే ఎలా? అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. చివరికి ఎంతో ఉదాత్తమైన రక్తదానం కార్యక్రమాన్ని కూడా అడ్డుకుంటే ప్రజలు సర్కారీ పోకడల్ని ఎలా అర్థం చేసుకోవాలి?!!
జనవరి 18.. బుధవారం.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్ధంతి. సహజంగానే ప్రతిఏటా ఆ పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తుంటారు. అలాగే ఈ ఏడాది కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రకరకాల సేవా కార్యక్రమాలను ప్లాన్ చేశారు. రాష్ట్రమంతా రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు ఇతర సేవా కార్యక్రమాలు ఉంటాయి. విజయవాడ శివార్లలోని గొల్లపూడి వన్ సెంటర్లో కూడా ఇలా రక్తదానం, తదితర సేవా కార్యక్రమాలను ప్లాన్ చేశారు.
అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించతలపెట్టిన రక్తదాన శిబిరం ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వెళ్లిన తెలుగుదేశం నాయకులు దేవినేని ఉమా తదితరులకు షాక్ ఎదురైంది. అసలు బుధవారం నాడు ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించడానికి వీల్లేదని అధికారులు అడ్డుకున్నారు. పోలీసులను కూడా తమకు అండగా తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ స్థలం వివాదంలో ఉన్నదని, అందువలన అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని వారి వాదన. దీంతో అక్కడ పెద్ద రభస జరిగింది. తెలుగుదేశం నాయకులు పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. పోలీసుల దమనకాండను గర్హించారు.
తెలుగుదేశం, ఇతర ప్రతిపక్షాల విషయంలో ప్రభుత్వం మరీ అతి చేస్తున్నదని ప్రజలు భావిస్తున్నారు. రోడ్ల మీద సభలు, సమావేశాలు, కనీసం రోడ్ షోలు నిర్వహించాలంటే కూడా అనుమతించరు. ఫలానా పబ్లిక్ ప్లేస్ లో సభలు పెట్టుకోవాలంటే వంద రకాల ఆంక్షలు విధిస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, అంటే తమ పార్టీ సొంత స్థలంలో, అది కూడా రక్తదానం వంటి మంచి కార్యక్రమం నిర్వహించడానికి పూనుకుంటూ దానిని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నంచడం అనేది చాలా నీచం అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రతిపక్షాలు సేవ చేసినా అడ్డుకోవడమేనా?
Sunday, December 22, 2024