ప్రజా వ్యతిరేకతను డిలీట్ చేయడం కుదురుతుందా?

Wednesday, January 22, 2025

గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని మరింత బాగా నిర్వహించాలంటూ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలను ఫాలో అప్ చేస్తూ ఉంటారు. ఆయన అంతా తరచుగా సమీక్షిస్తుండడం వల్ల ఇష్టం ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఉన్నారు. ఇలా ప్రజల ఎదుటకు వెళ్లడం వలన పార్టీకి రాగల అడ్వాంటేజీ ఎంత ఉంటుందో తెలియదు గానీ.. ప్రజల్లోని వ్యతిరేకత మాత్రం చాలా స్పష్టంగా బయటపడుతోంది. ప్రభుత్వం పట్టించుకోని స్థానిక సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేలను ఎడాపెడా నిలదీస్తున్నారు.

చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుంది గనుక వారు నిలదీశారు. కానీ ఎలీజా వారిపట్ల చాలా అనుచితంగా ప్రతిస్పందించారు. ఆయన ప్రవర్తనతో ప్రజల్లో పార్టీ పరువు మరింత పోయేలాగా తయారైంది.

ఇంతకూ విషయమేంటంటే.. ఎమ్మెల్యే ఎలీజా గడపగడపకు కార్యక్రమంలో భాగంగా లింగపాలెం మండలం బోగోలు గ్రామంలో పర్యటించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఏకరవు పెట్టడం ప్రారంభించారు. అయితే స్థానిక ప్రజలు, మహిళలు మాత్రం ఎమ్మెల్యేను నిలదీసి.. పథకాల సంగతి సరే దారుణంగా ఉన్న రోడ్ల మాట ఏమిటి అని ప్రశ్నించారు. ‘‘రోడ్లు దారిలో ఉన్నాయి.. వస్తున్నాయి’’ అని వెటకారంగా మాట్లాడుతూ ఎలీజా అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు.

రోడ్లు రిపేరు చేయమని అడిగితే.. ‘వస్తున్నాయి.. దార్లో ఉన్నాయి’ అనడం ద్వారా ఆయన ప్రజలను వెటకారం చేశారో.. లేదా.. ఏ పనీ చేయలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వెటకారం చేశారో తెలియదు. అయితే ప్రజలు మళ్ళీ ఆయనను చుట్టుముట్టి రహదారుల విషయం నిలదీయడం జరిగింది.

ట్విస్టు ఏంటంటే.. అయితే ఈ వ్యవహారాన్ని ఫోటోలు తీస్తున్న విలేకరుల మీద ఎలీజా మనుషులు దౌర్జన్యానికి పాల్పడడం ఇక్కడ గమనార్హం. ఎమ్మెల్యే ఎలీజా పీఏ శామ్యూల్- విలేకరి మీదికి దూసుకు వచ్చి మొబైల్ ఫోన్ లాక్కొని అందులో తీసిన ఫోటోలు వీడియోలను డిలీట్ చేయడం జరిగింది. విలేకరులు ఫోటోలు తీస్తే వాటిని తమ అనుచరులు డిలీట్ చేయగలరు గాని, ప్రజల్లో మీ పట్ల పెల్లుబుకుతున్న వ్యతిరేకతను ఏ రకంగా డిలీట్ చేయగలరు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నికరమైన అభివృద్ధి పనులతో తప్ప మాయమాటలతో ప్రజా వ్యతిరేకతను గెలవడం సాధ్యం కాదని హెచ్చరిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles