ఆయన గౌరవప్రదమైన రాజ్యాగంబద్ధమైన పదవిలో ఉన్న సీనియర్ నాయకుడు. కానీ ప్రత్యర్థి పార్టీ నాయకుల ప్రస్తావన వస్తే.. ఆయన భాష మొత్తం నేలబారుగా దిగజారిపోతుంది. ఇంత ఉన్నత పదవిలో ఉన్న నాయకుడేనా ఇంత చిల్లరగా మాట్లాడుతున్నది అని చూస్తున్న వారికి అనుమానం కలుగుతుంది. ఆయన మరెవ్వరో కాదు.. ఏపీ అసెంబ్లీ తమ్మినేని సీతారాం. ప్రత్యర్థి పార్టీ నాయకులను తిట్టిపోసే విషయంలో తన నోటికి అడ్డు అదుపు లేనట్లుగా చెలరేగిపోయే తమ్మినేని సీతారాం.. తన నియోజకవర్గంలోని ప్రజల పట్ల కూడా అదే రీతిగా వ్యవహరించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. తన పార్టీ వారు అయినా కాకపోయినా తన నియోజకవర్గంలోని ప్రజల పట్ల ఆయన దురుసుగా స్పందిస్తే ఎలా అని ప్రజలు అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం.. చాలా మంది ఎమ్మెల్యేలకు కంటగింపుగా ఉంది. గెలిచిన తర్వాత.. మళ్లీ ఎన్నికలు వచ్చే దాకా, ప్రజలు వారి వారి అవసరాలకోసం తమ వద్దకు రావాల్సిందే తప్ప.. వారి వద్దకు తాము అధికారంలో ఉండగా వెళ్లడం అలవాటు లేని అనేకమంది సీనియర్ నాయకులు.. ఈ కార్యక్రమంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ వ్యవహారం అంతా వారికి నచ్చడం లేదు. జగన్ తనంత తాను ఎవరెలా తిరుగుతున్నారో గణాంకాల సహా వివరాలు తెప్పించుకుంటూ సమీక్ష సమావేశాల్లో వెంటపడుతుండడంతో.. చచ్చినట్టు ప్రతి ఎమ్మెల్యే కూడా ఇష్టంలేకపోయినా ఇంటింటికీ తిరగాల్సి వస్తోంది. వారందరి సంగతి ఎలా ఉన్నా..
స్పీకరు తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆమదలావలస మండలంలో గడపగడపకు కార్యక్రమంలో భాగంగా నెల్లిపర్తి గ్రామంలో పర్యటించారు. వెళుతూ వెళుతూ తెలుగుదేశానికి చెందిన కార్యకర్త ఇల్లు లాగానే.. ఆ ఇంటి మహిళ బయటే నిల్చుని ఉన్నప్పటికీ.. కనీసం పలకరించకుండా ముందుకు వెళ్లిపోయారు. అయితే ఆమె స్పీకరు ముందుకు వచ్చిన తాను అంగన్ వాడీ టీచరుగా పనిచేస్తుండగా,.. ఏ కారణమూ చెప్పకుండా తొలగించారని స్పీకరు తమ్మినేనిని ప్రశ్నించారు.
దీంతో ఆయనకు ఆగ్రహం నషాళానికంటింది. ఆమె మీద నోరు చేసుకున్నారు. నీ ఇష్టమొచ్చిన దగ్గర చెప్పుకో పో అంటూ మండిపడ్డారు. దీంతో ఆ మహిళ కూడా ఏం తగ్గలేదు. ఏ తప్పూ చేయకపోయినా ఉద్యోగంలోంచి ఎందుకు తీసేసారంటే దిక్కున్న ట చెప్పుకోమంటారా? స్పీకరు వాడాల్సిన భాషేనా ఇది? ఇదేనా మీ సంస్కారం? అంటూ తమ్మినేనిని నిలదీశారు. ఈ సారి ఓట్లకోసం వచ్చినప్పుడు మీ సంగతి తేలుస్తాం అంటూ ఆమె ముక్తాయించడం విశేషం.