వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలీసులు ప్రభుత్వానికి మానసికంగా బానిసలుగా తయారయ్యారా? అనే అభిప్రాయాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ప్రతిపక్షాలను నియంత్రించడానికి, వారి గొంతు వినిపించకుండా చేయడానికి అధికారంలో ఉన్న పార్టీ పోలీసు బలగాల్ని వాడుకుంటూ ఉంటుంది. ఇందులో కొంత హెచ్చుతగ్గులు ఉండవచ్చు. వైసీపీ జమానాలో ఇది పీక్స్ కు వెళ్లిందని అంటున్నవాళ్లు అనేకులుఉన్నారు. అయితే ఇదంతా కూడా ప్రతిపక్షాలను నియంత్రించడానికి మాత్రమే. కానీ.. ప్రతిపక్షాలు నిర్వహించే సాధారణ కార్యక్రమాలను కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించడం, రెచ్చిపోవడం ఇదంతా కూడా స్వామిని మించిన స్వామిభక్తి ప్రదర్శించడం అవుతుంది. ఇప్పుడు పోలీసులు అదే పనిచేస్తున్నారు.
రోడ్ షోలు, రోడ్లమీద సభలు సమావేశాలు నిర్వహించడానికి వీల్లేకుండా జగన్ సర్కారు కొత్త సంవత్సరంలో జీవోనెం.1 తీసుకువచ్చింది. దానిపట్ల ప్రతిపక్షాల్లో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన, తెదేపా పార్టీలు ఉమ్మడి కార్యచరణతో దీనికి వ్యతిరేకంగా ఐక్యపోరాటం చేయాలని కూడా నిర్ణయించాయి. ఇలాంటి నేపథ్యంలో భోగిపండుగ రోజున.. భోగిమంటల్లో జీవోనెం.1 కాపీలను వేసి తగులబెట్టడం ద్వారా తమ నిరసన తెలియజేయడానికి తెలుగుదేశం పూనుకుంది. అయితే దీనిని అడ్డుకోవడానికి పలుచోట్ల పోలీసులు రెచ్చిపోవడమే తమాషా.
సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ప్రజా వ్యతిరేక జీవోలను తెచ్చినప్పుడు వాటిపట్ల నిరసనలు వ్యక్తం చేయడంలో భాగంగా ఆ ప్రతులను చించి పోగులు పెట్టడం, రోడ్ల మీద తగులబెట్టడం అనేది నిరసనకారులు ఎంచుకునే మార్గాల్లో ఒకటి. రాజకీయ నిరసనల్లో దిష్టిబొమ్మను దహనం చేయడం కూడా చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అదే క్రమంలోనే తెలుగుదేశం నాయకులు భోగిమంటల్లో జీవో నెం.1 కాపీలను తగులబెట్టే ప్రయత్నం చేశారు. దీనిని పోలీసులు కొన్నిచోట్ల ఓర్వలేకపోవడం జరిగింది.
నాయకుల్ని అడ్డుకోవడం, మంటల్లో వేసిన జీవో కాపీలను బయటకు తీయడం, నాయకులతో తగాదాపెట్టుకుని వార్నింగులు ఇవ్వడం.. ఇలా పోలీసులు తమ స్వామిభక్తిని ప్రదర్శించుకున్నారు. ధర్మవరం సీఐ సుబ్రహ్మణ్యం తెలుగుదేశం నాయకులమీద తీవ్రస్థాయిలో ఆగ్రహం ప్రదర్శించడం కూడా వార్తల్లోకి వచ్చింది.
సాధారణంగా మన దేశంలో రాజ్యాంగం పట్ల అనుచితంగా ప్రవర్తించడం అనేది నేరంగా పరిగణనలో ఉంటుంది. రాజ్యాంగ ప్రతులను చించినా, తగులబెట్టినా దానిని నేరంగా ఎంచి కేసులు నమోదు చేస్తారు. అంతే తప్ప.. ప్రభుత్వాలు తెచ్చే జీవోల పట్ల నిరసన వ్యక్తం చేస్తే అది నేరం అని నిర్దేశిస్తున్న చట్టాలు లేవు. కానీ.. ముందే చెప్పుకున్నట్టు స్వామిని మించిన స్వామిభక్తి ప్రదర్శించడమే లక్ష్యంగా పోలీసులు జీవోనెం.1 కోసం రెచ్చిపోవడం గమనార్హం.
పోలీసులు.. మానసికంగా బానిసలయ్యారా?
Thursday, November 14, 2024