పొత్తు పొడిచింది.. ఇక వారికి దబిడిదిబిడే!

Thursday, November 14, 2024

తెలుగుదేశం పార్టీ – జనసేన మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఏర్పడరాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా అనుకున్నది. ఈ రెండు పార్టీలు కలిస్తే.. ఖచ్చితంగా తమ ప్రభుత్వానికి మరణశాసనం లిఖించగలవనే భయం ఆ పార్టీలో ఉంది. పైకి ఎంత బింకంగా మాట్లాడినా ఈ పొత్తు గురించి ప్రస్తావించకుండా ఏ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు కూడా లేరు. ఆ రెండు పార్టీలు కాదు కదా.. ఇంకా పది పార్టీలు వచ్చి ఒకే కూటమిగా పోటీచేసినా.. తమ సంక్షేమ పథకాలు తమని గెలిపిస్తాయని ధీమాగా పలికిన వారు లేరు. నిజానికి ఆ పొత్తును అడ్డుకోడానికి చాలా చాలా ప్రయత్నించారు. కానీ.. పొత్తు దాదాపుగా ఖరారు అయింది. నేరుగా పొత్తు అనే పదాలు ఉపయోగించకపోయినప్పటికీ.. పొత్తు కుదిరినట్లే అనే అర్థం వచ్చేలా.. రాష్ట్ర ప్రజలు కోరుకున్నదే జరుగుతుంది అని అంటూ.. పవన్ కల్యాణ్ తన బందరు ప్రసంగంలో స్పష్టత ఇచ్చారు. ఆ పొత్తు బంధం ఉదయించడంతో ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దబిడిదిబిడే అని పలువురు విశ్లేషిస్తున్నారు.
నిజానికి తెలుగుదేశం- జనసేన మధ్య పొత్తు బంధం ఏర్పడకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైన మైండ్ గేమ్ ఆడింది. ఎంతో బలమైన సోషల్ మీడియా బృందాలను కలిగిఉన్న వైసీపీ వ్యూహాత్మకంగా తప్పుడుప్రచారాలను వ్యాప్తిలోకి పెట్టింది.
తెలుగుదేశం పార్టీ చాలా బలపడిపోయిందని, జనసేనతో పొత్తు పెట్టుకోవడం, వారికి కొన్ని సీట్లు పంచి ఇవ్వడం తెదేపా నాయకులు చాలా మందికి అస్సలు ఏమాత్రం ఇష్టం లేదని ఒక పెద్ద ప్రచారం నడిచింది. జనసేనతో పొత్తు పెట్టుకుంటే గనుక.. వారికి కేటాయించే సీట్లలో తెలుగుదేశం నాయకులు, ఆశావహులు పార్టీని వీడిపోయే ప్రమాదం ఉన్నదని కూడా ప్రచారం చేశారు. అయితే తెదేపా వారు ఈ ప్రచారం పట్ల చాలా సంయమనం పాటించారు.
మరోదఫా జనసేన వైపు నుంచి ఇంకో మైండ్ గేమ్ ప్రారంభించారు. తెలుగుదేశం జనసేనకు 20 సీట్లు మాత్రమే ఇవ్వడానికి ఒప్పుకున్నదని, ఆ రకంగా పవన్ కల్యాణ్ తన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ప్రచారం నడిపించారు. అయితే ఈ ప్రచారం విషయంలో జనసైనికుల్లో ఆందోళన వ్యక్తమైంది గానీ, పవన్ కల్యాణ్ చాలా సంయమనం పాటించి వారికి సర్దిచెప్పారు. 20 సీట్లకు నేను ఒప్పుకుంటానా? అనే క్లారిటీ ఇచ్చారు. సీట్ల విషయం అసలు తాను చంద్రబాబుతో మాట్లాడనే లేదని చెప్పారు. జనసైనికుల ఆత్మగౌరవం దెబ్బతినేలా ఏ డీల్ కు ఒప్పుకోనని కూడా స్పష్టత ఇచ్చారు. జనసేనకు రాష్ట్రమంతా 175 స్థానాల్లో పోటీచేసే దమ్ముందా అని ముఖ్యమంత్రి జగన్ అంటూ.. రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు గానీ.. పవన్ రెచ్చిపోలేదు. ఏం చేస్తే మంచి జరుగుతుందో, పార్టీ తరఫున పోటీచేసిన వాళ్లందరూ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టే పరిస్థితి వస్తుందో అలాంటి నిర్ణయమే తీసుకుంటాం అని ప్రకటించారు. మొత్తానికి ఈ ఇరుపార్టీల మధ్య పొత్తు పొడిచింది. దేన్నయితే సంభవించకుండా చూడాలని వైసీపీ ఆరాటపడిందో.. అది సంభవించింది. ఈ పొత్తు జగన్ సర్కారుకు ఎంతమేర ప్రమాదంగా మారుతుందో వేచిచూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles