ఏపీలో రాబోయే ఎన్నికల్లో విపక్షాలు కలసికట్టుగానే పోటీచేయబోతున్న సంగతిని పవన్ కల్యాణ్ మరోమారు ధ్రువీకరించారు. పొత్తుల సంగతి త్వరలో తేలుతుందని పార్టీ రాజకీయ వ్యవహారాల సారథి నాదెండ్ల మనోహర్ ప్రకటించిన కొన్ని రోజుల వ్యవధిలోనే.. పవన్ కల్యాణ్ ఈ మాట చెప్పడం విశేషం. పొత్తుల సంగతి అధికారిక ప్రకటన లాగా కాకపోయినప్పటికీ.. దాదాపు అంతే స్పష్టంగా విపక్షాలు కలిసి మాత్రమే వైసీపీని ఓడించబోతున్నాయనే సంగతిని పవన్ కల్యాణ్ తేల్చేయడం విశేషం. ఈ ప్రకటనతో.. తెలుగుదేశం- జనసేనలతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా పొత్తుల కూటమిలో ఉంటుందనే అభిప్రాయం కూడా ప్రజలకు కలుగుతోంది.
బిజెపి కూడా వెంట ఉంటుందనే సంకేతాలను పవన్ తాజాగా అందించారు. 2014లో తాము ముగ్గురమూ కలిసి పోటీచేసినప్పుడు వైసీపీ గెలవలేకపోయిందని చెప్పారు. ఈసారి కూడా ఓటు చీలనివ్వను, వైసీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వను అనడాన్ని బట్టి.. మోడీతో మంత్రాంగం నెరపి బిజెపితో కలిసి కూటమిగా పోటీచేసే పరిస్థితిని పవన్ స్వయంగా కల్పిస్తారనే అర్థమవుతోంది.వైసీపీ మళ్లీ గెలిస్తే రాష్ట్రం అంధకారమయం అవుతుందని, అథోగతి పాలవుతుందని అలాంటి దుస్తితి రాష్ట్రానికి రానివ్వనని పవన్ ప్రతిజ్ఞ చేయడం విశేషం.
పవన్ కల్యాణ్ ను నైతికంగా దెబ్బతీయడానికి, ఆయన స్థైర్యాన్ని పలుచన చేయడానికి వైసీపీ రకరకాల కుట్రలకు, దుర్మార్గపు ప్రచారాలకు తెగబడుతున్న సంగతి అందరూ గమనిస్తున్నదే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వైసీపీ వారి ప్రచారాలకు దీటుగా స్పందిస్తున్నారు.
పొత్తుల విషయానికి వస్తే.. భారతీయ జనతా పార్టీ కూడా జనసేన- తెలుగుదేశంలతో కలిసి నడుస్తుందా లేదా అనే సందేహం పలువురిలో ఉండేది. రాష్ట్ర బిజెపి నాయకులు చాలా సందర్భాల్లో తెలుగుదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ.. ఎన్నికల సమయం వచ్చేసరికి రాష్ట్ర విశాలప్రయోజనాల దృష్ట్యా అనే పదంతో చేతులు కలపడానికి వీలుగానే మాట్లాడుతూ వస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఇంచుమించుగా అదే చెబుతూన్నారు.
అయితే చివరి నిమిషంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో బిజెపి లోకల్ నాయకత్వం కుమ్మక్కు అయి.. పొత్తులకు వ్యతిరేకంగా తయారైతే.. రాష్ట్రమంతా తమ పార్టీ ఒంటరిగా పోటీచేస్తుందని డిసైడ్ చేస్తే గనుక.. ప్రత్యమ్నాయం కూడా పవన్ దృష్టిలో ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన లతో కలిసి పనిచేయడానికి రాష్ట్రంలో వామపక్షాలు ఉత్సాహపడుతున్నాయి. ఆ మాటకొస్తే జగన్ ప్రభుత్వ విధానాల మీద వారు తొలినుంచి నిరంతర పోరాటం సాగిస్తూనే ఉన్నారు. వారిని కలుపుకుని కూటమిగా ఎన్నికలకు వెళ్తారనే అంచనాలు కూడా సాగుతున్నాయి.