పొంగులేటి సభ.. బిజెపి గుండెల్లో రాయి!

Wednesday, January 22, 2025

ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాను కాంగ్రెస్ లో చేరబోతున్న సంగతిని అధికారికంగా ప్రకటించారు. న్యూఢిల్లీలో అటు రాహుల్ గాంధీ, ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కూడా కలిసిన పొంగులేటి, జూపలి కృష్ణారావులు.. వారితో భేటీ అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఇద్దరు నాయకులు తమ తమ ప్రాంతాల్లో వేరువేరుగా నిర్వహించే భారీ బహిరంగ సభల్లో కాంగ్రెసులో చేరబోతున్నారు. జులై 2వ తేదీన కనీ వినీ ఎరుగని రీతిలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అయితే పొంగులేటి మాటలు.. బిజెపి గుండెల్లో రాయి పడ్డట్టుగా తయారయ్యాయని చెప్పాల్సిందే.

ఎందుకంటే.. ఖమ్మంలో జులై 2న తాము నిర్వహించబోయే సభ గురించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా హైప్ క్రియేట్ చేశారు. ఈ సభ కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని చెప్పడం మాత్రమే కాదు, పోలిక కూడా చెప్పారు. భారాసను స్థాపించిన కేసీఆర్, ఎక్కడో హైదరాబాదులో తన జాతీయ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించాల్సింది పోయి, ఏదో బలప్రదర్శనకు అన్నట్టుగా ఖమ్మంలో సభ నిర్వహించారని, నాటకాలు చేశారని పొంగులేటి ఆరోపించారు. ఆ కేసీఆర్ నాటకాలను తలదన్నేలా.. అంతకు మించిన స్థాయిలో తాను పార్టీలో చేరబోయే సభ నిర్వహిస్తామని పొంగులేటి తేల్చి చెప్పారు. ఈ మాటలు నిజంగా బిజెపికి భయం పుట్టించే మాటలు.

ఖమ్మం లోనే భారతీయ జనతా పార్టీ కూడా అమిత్ షా హాజరయ్యే భారీ బహిరంగ సభను నిర్వహించాలని తలపోసింది. సరిగ్గా సభ తలపెట్టిన రోజుకు గుజరాత్ లో వరదలు ఉధృతంగా ఉండడంతో అది కాస్తా వాయిదా పడింది. తర్వాత ఎఫ్పుడు నిర్వహించేది వారింకా నిర్ణయించలేదు. జులై 2 లోగా బిజెపి సభ జరిగే అవకాశం లేదు. 2వ తేదీన పొంగులేటి నిర్వహిస్తున్న కాంగ్రెస్ సభ కూడా విజయవంతంగా జరిగిందంటే.. భాజపాకు టార్గెట్ చాలా పెద్దది అవుతుంది.

కాంగ్రెసు సభకంటె చాలా పెద్ద స్థాయి జనసమీకరణ చేపట్టి ఖమ్మం సభను నిర్వహించడం తప్ప వారికి వేరే గత్యంతరం ఉండదు. భారాస ఆవిర్భావం పేరిట కేసీఆర్ చాలా పెద్ద సభనే నిర్వహించారు. ఇప్పుడు దానిని తలదన్నేలా తన సభ ఉంటుందని పొంగులేటి అంటున్నారు. దీనిని కూడా తలదన్నేలా బిజెపి సభ ఉండి తీరాలి. జిల్లాలో పార్టీకి బలం లేకపోయినా సరే.. సభను మాత్రం విజయవంతం చేయాలి. లేకపోతే పరువు పోతుంది. అలాంటి సంకట పరిస్థితి ఇప్పుడు బిజెపికి ఎదురైంది. అసలే ఖమ్మంలో బిజెపి వీక్ అని ఆ మద్య ఈటల కూడా అన్నారు. ఇప్పుడు వారేం చేస్తారో చూడాలి. అమిత్ షా తెలంగాణ సభకు వేదిక మార్చుకోవచ్చునని, లేదా కొన్ని నెలలపాటు వాయిదా వేసుకోవచ్చునని పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles