ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి ఎన్నికలలో కారు గుర్తు అనేది కనపడకుండా చేస్తానని ఆ పార్టీ నుంచి బహిష్కృతుడైన సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును గద్దె దించుతానని తొలినుంచి అంటూనే వస్తున్నారు. ఇప్పుడు, ఆదివారం సాయంత్రం ఖమ్మం లో జరిగే భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీతో కండువా కప్పించుకుని పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ సభను విజయవంతం చేసే బాధ్యత తనే చూసుకుంటూ, ఖమ్మం జిల్లాలో తన హవా ఏమిటో చాటుకోవడానికి దీనిని అవకాశంగా వాడుకోవాలని పొంగులేటి ఆశిస్తున్నారు.
పార్టీలో చేరడానికి ముందుగానే పొంగులేటి ప్రభావం, ఆయన ప్రయోగించగల ఆకర్షణ మంత్రం ప్రభావం ఏమిటో భారత రాష్ట్ర సమితికి స్వానుభవంలోకి వస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే పొంగులేటితో సన్నిహితంగా మెలిగే నాయకుడు అనే ఆరోపణలు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అధికార పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఒక జడ్పిటిసి, 56 మంది సర్పంచులు, 26 మంది ఎంపీటీసీలు కూడా రాజీనామాలు చేశారు. అధికార పార్టీకి ఇది ఇల్లందు నియోజకవర్గంలో గట్టి దెబ్బ గానే పరిగణించాల్సి ఉంటుంది.
జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య గత కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సన్నిహితంగా మెలుగుతున్నారనే ప్రచారం ఉంది. పొంగులేటిని బహిష్కరించిన తర్వాత కూడా ఆయనతో క్లోజ్ గా మెలగుతున్న కనకయ్య వైఖరిని సహించలేని గులాబీ కార్యకర్తలు- ఆయన తమ పార్టీ అందించిన జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మీకు కావలిస్తే తన మీద అవిశ్వాస తీర్మానం పెట్టుకోండి అంతేతప్ప రాజీనామా చేసే ప్రసక్తే లేదు అని కనకయ్య కూడా ఇన్నాళ్లు భీష్మించుకుని కూర్చున్నారు ఇప్పుడు కూడా ఆయన భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు తప్ప జడ్పీ చైర్మన్ పదవిని వదులుకోలేదు.
అసలే ఖమ్మం జిల్లాలో అంతగా బలం లేని భారాసకు జడ్పీ చైర్మన్ స్థాయి నాయకుడు పార్టీని వేడి వెళ్లిపోవడం గట్టి దెబ్బ అనే చెప్పాలి. ఆయన పోక వలన తమకు కలిగే నష్టమేమీ లేదని బి ఆర్ ఎస్ దళాలు అతిశయంగా పలకవచ్చు గాని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన రాకతో తమకు లాభం జరుగుతుందని నమ్మకంతోనే ఉంది.