ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు, ఇసుక ముసుగులో సాగుతున్న దందాలు ఇప్పుడు సంచలనంగా చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే ఈ ఇసుక అక్రమాలకు సంబంధించిన ఆరోపణలన్నీ కూడా.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూతా మాత్రమే తిరుగుతున్న నేపథ్యంలో ఆయనే స్వయంగా వివరణ ఇచ్చారు. ఆయన వివరణ నిండా అనేక అనుమానస్పదమైన మాటలు, అబద్ధాలు, మాయలు అన్నీ చోటు చేసుకున్నాయి. తాము చేస్తున్న అక్రమాలను విచ్చలవిడిగా, అడ్డగోలుగా సమర్థించుకునేందుకు ఆయన ప్రయత్నించారు. ఆయన సమర్థించుకునే తీరు, ఆ వివరణ గమనిస్తేనే ఏ రేంజిలో అక్రమాలు జరుగుతున్నాయో అందరికీ అర్థమైపోయే తీరుగా ఉంది.
నదుల్లో పూడిక తీయడం జరుగుతున్నదే తప్ప.. ఇంకెక్కడా ఇసుక తవ్వడం లేదని మంత్రి వివరణ ఇవ్వడం పెద్ద పరిణామం. నదీగర్భాల్లో జేసీబీలు, పొక్లయిన్లు పెట్టి.. రోజుకు కొన్ని వందల ట్రక్కుల ఇసుకను తవ్వేస్తుండగా.. మంత్రి మాత్రం అదంతా కేవలం పూడిక తీయడం మాత్రమేనని సెలవిస్తున్నారు. పూడిక తీస్తున్నందుకు సదరు సంస్థలు విడిగా ప్రభుత్వం నుంచి బిల్లులు పొందుతున్నాయేమో అని ప్రజలు పెద్దిరెడ్డి మాటలను బట్టి అనుమానిస్తున్నారు.
అదేవిధంగా ఇసుక రీచ్ లవద్ద కేవలం నగదురూపంలో మాత్రమే సొమ్ము తీసుకుంటున్నారనేది.. వీరి అక్రమాలు, స్వాహా పర్వానికి సంబంధించి ప్రధానమైన ఆరోపణ. కేవలం నగదు చెల్లింపులు మాత్రమే స్వీకరిస్తుండడం వల్ల.. ప్రతిరీచ్ వద్ద కూడా కొన్ని వందల ట్రక్కుల ఇసుకను తరలిస్తూ.. పదుల సంఖ్యలోమాత్రమే రికార్డుల్లోకి ఎక్కిస్తూ స్వాహా పర్వం నడిపిస్తున్నారనేది ప్రధాన విమర్శ. అయితే దీనికి మంత్రి పెద్దిరెడ్డి ఇచ్చిన సమాధానం, వివరణ చాలా కామెడీగా ఉంది. ప్రజల సౌకర్యం కోసం మాత్రమే రీచ్ లలో నగదు మాత్రమే తీసుకుంటున్నారట. ఈ రోజుల్లో ఇంతకంటె కామెడీ మరొకటి ఉండదు. వీధిలో బజ్జీలు అమ్మేవాళ్లు కూడా డిజిటల్ పేమెంట్స్ స్వీకరిస్తున్నారు. వేల రూపాయల డబ్బు ఇసుకకు తీసుకుంటూ కేవలం నగదు మాత్రమే తీసుకుంటాం అనడం ఖచ్చితంగా మోసమే. ప్రభుత్వ ఖజానాకు దక్కవలసిన సొమ్మును మధ్యలో దోచుకోవడమే.
ఈ అక్రమాలకు ప్రధాన పాత్రధారి అయిన జేపీ సంస్థకు కాంట్రాక్టు పొడిగింపు ఆర్డర్ చూపించమంటే.. మంత్రి ఏదేదో సెలవిచ్చారు. వారు ఎవరికి సబ్ కాంట్రాక్టు ఇస్తారనేది తమకు సంబందం లేదని చెబుతున్నారు. ఆ జేపీ సంస్థ తమ ఇష్టానుసారంగా 90 శాతం తెలుగుదేశం వారికే సబ్ కాంట్రాక్టులు ఇచ్చిందని బుకాయించే ప్రయత్నం చేశారు. మేం చెప్పినట్టు చేయడానికి జేపీ సంస్థ మా చుట్టాలేమీ కాదు కదా అంటున్నారు. అంతా తెలుగుదేశం వాళ్లకే సబ్ కాంట్రాక్టులు ఇస్తే.. జేపీసంస్థకు ఎందుకు కాంట్రాక్టు పొడిగించారని అంటే జవాబులేదు.
ఈ రకంగా తన వివరణలోని మాయమాటల ద్వారా.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇసుకతవ్వకాల్లో జరుగుతున్న యావత్ అక్రమాలను తానే బయట పెట్టుకున్నట్టుగా అయింది.