పార్టీని కాపాడుకోవడానికి రోజులో కాసింత సమయం వెచ్చించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఖాళీ లేదా? లేక, ఆసక్తి లేదా? అనే సందేహం రాష్ట్రంలోని ప్రజలకు కలుగుతోంది. మనం విపరీతంగా వేలు, లక్షల కోట్ల రూపాయలు ఖరీదైన సంక్షేమం చేపట్టేస్తున్నాం.. కాబట్టి మనకు తిరుగులేదు.. మళ్లీ ఎన్నికల్లో మనం గెలిచి తీరుతాం.. అని జగన్ పదేపదే అంటుంటారు. గెలుపు మీద ఎటూ అంత భరోసా ఉన్నది గనుక.. పార్టీ ఎలా తగలబడిపోయినా పర్లేదు.. ఫ్యానుగుర్తుకు ఓట్లు పడిపోతాయి.. అని జగన్ అనుకుంటున్నారేమో అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది.
పార్టీని కాపాడుకోవడం అంటే గడపగడపకు కార్యక్రమంలో ఇల్లిల్లూ తిరగాలని ఎమ్మెల్యేల వెంటపడడం మాత్రమే కాదు. నియోజకవర్గాల్లో ముఠాలు హద్దులు దాటకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. కానీ.. ఆ సంగతి జగన్ కు అసలు పట్టినట్టుగా కనిపించదు. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ నేతలు ముఠాలుగా విడిపోయి కుమ్ములాడుకుంటూ ఉంటే.. వాటిని చక్కబెట్టే బాధ్యతను ఇతరుల మీదికి నెట్టేసి.. జగన్ నిర్లిప్తంగా ఉండిపోతుంటారు. ఒకస్థాయి ముఠాల వ్యవహారం ఇతరులు చక్కబెట్టగల పరిధిలో ఉండేవి కావొచ్చు. కానీ.. ముఖ్యమంత్రి స్వయంగా చొరవతీసుకుని.. ఫుల్ స్టాప్ పెట్టాల్సిన తగాదాలు కొన్నుంటాయి. అది ఆయన తెలుసుకోవాలి.
మడకశిర విషయానికే వద్దాం. ఎమ్మెల్యే తిప్పేస్వామి అసమర్థత, అవినీతి అని ఎండగడుతూ స్థానిక వైసీపీ నాయకులే నానా రాద్దాంతం చేస్తుంటారు. వారు శృతిమించి మాట్లాడుతున్న తీరు చూస్తే.. ఉన్నదికొంతైతే వారు చెబుతున్నది మరింతగా ఉందని అనిపిస్తుంది. ఏది ఏమైనా.. తిప్పేస్వామి మాకొద్దు అనే నినాదం మడకశిర వైసీపీలో ప్రధానంగా ప్రతిధ్వనిస్తున్నది. ఈ నియోజకవర్గ సమీక్షకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చిన ప్రతిసారీ గొడవే. చివరికి పార్టీ నాయకులను పోలీసులతో కూడా బెదిరించారు. కానీ వారు చల్లబడలేదు.
ఈసారి పెద్దిరెడ్డి వచ్చినప్పుడు కేవలం నినాదాలతో.. తిప్పేస్వామి వ్యతిరేకులు ఊరుకోలేదు. ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ఏకంగా ఆయన మీదికి చెప్పులు విసిరారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఏపీ కేబినెట్ లో జగన్ తర్వాత.. నెంబర్ టూ లాగా చెలామణీ అవుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే. అలాంటి సీనియర్ నేత మీదికి చెప్పులు విసిరారంటేచాలా సీరియస్ విషయం అని అర్థం చేసుకోవాలి. పెద్దిరెడ్డి మీద చెప్పులు విసిరేదాకా పరిస్థితులు విషమించాయంటే.. ఇంకా మేలుకోకుండా జగన్ నిద్ర నటిస్తే.. పార్టీ పుట్టి మునుగుతుందని, ఓటమి తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.