రాష్ట్రమంతా కలిపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు అనధికారికంగా ఏమైనా వెళ్లిపోయాయా? లేదా, ఒకరిని చూసి మరొకరు రెచ్చిపోతున్నారా? లేదా, వారి సహజమైన స్వభావంలోనే అటువంటి లక్షణం ఉన్నదా? లేదా, తెలుగుదేశం, విపక్షాలు పార్టీ ప్రజల్లోకి వెళ్లడం అంటూ జరిగితే, ఇక తమ పని అంతే అనే భయం వారిలో ఉన్నదా? మూలకారణాలు బోధపడడం లేదుగానీ.. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అంటూ పిలుపు ఇచ్చిన టీడీపీ కార్యక్రమానికి వైసీపీ దళాలు అడ్డుతగలడం, ఘర్షణలు, హింస చెలరేగడం రోజువారీ అంశంగా మారిపోతోంది.
రాష్ట్రంలో చెదురుమదురుగా అనేక ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. మాచర్లలో జరిగిన హింస వీటికి పరాకాష్ట. తాజాగా, జగన్ తర్వాత ప్రభుత్వంలో అంతటి ప్రాధాన్యం ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా అయిన పుంగనూరు నియోజకవర్గంలో కూడా వరుస ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఇరుపార్టీల వారు ఘర్షణ పడితే అడ్డుకోడానికి ప్రయత్నించిన పోలీసులు గాయపడడం కూడా ఇక్కడ జరుగుతోంది.
ఇక్కడ టీడీపీ ఇన్చార్జిగా చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) ఉన్నారు. ఆయన ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహించడానికి వెళ్తోంటే.. వైసీపీ శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గురువారం రాత్రి టీడీపీ వాళ్లు బ్యానర్లు కడుతున్నప్పుడే ఘర్షణలు జరిగాయి. వీరు కట్టిన వాటిని వైసీపీ కార్యకర్తలు తొలగించడంతో తగాదా మొదలైంది. శుక్రవారం కార్యక్రమానికి వెళుతుండగా మళ్లీ ఘర్షణలు జరిగాయి. చల్లా బాబు కారుపై దాడిచేయడంతో అద్దాలు పగిలాయి. మళ్లీ నంజంపేట అనే గ్రామంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. వీరిని అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులకు కూడా గాయాలయ్యాయి.
ఇవి ఇదేం ఖర్మకు సంబంధించి తాజా దౌర్జన్యాలు మాత్రమే. సుమారు వారం కిందట నవీన్ యాదవ్ అనే టీడీపీ నేత ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడిచేశారు. డిసెంబరు ప్రారంభంలో.. జనసేన నాయకుడికి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. గత ఎన్నికల్లో జనసేన తరఫున పెద్దిరెడ్డిపై తలపడిన పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్.. రైతులతో సదస్సు నిర్వహించడానికి ప్రయత్నిస్తేనే వైసీపీ వారు ప్రతిఘటించారు. ఆయన కొత్తగా కట్టుకున్న ఇంటిమీద దాడిచేసి.. ఇంటి ఆవరణను ధ్వంసం చేశారు. ఆయనను పోలీసులు ఇల్లు కదలకుండా నిర్బంధించారు. కార్యక్రమానికి వెళ్లనివ్వలేదు.
ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి చిన్న కార్యక్రమం అయినా సరే.. దాన్ని అంతగా సహించలేనంత భయం వైసీపీ నాయకుల్లో.. ప్రధానంగా, తన నియోజకవర్గంలో తిరుగులేని పట్టు ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలో ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ అందరికీ ఎదురవుతున్న ప్రశ్న. ప్రజలు ఇలాంటి దాడులను చూసి, వైసీపీ పట్ల అసహ్యాన్ని పెంచుకుంటారనే భయం వారికి ఉండదా అని ప్రజలు అనుకుంటున్నారు.
పెద్దిరెడ్డి ఇలాకాలో దౌర్జన్యాలకు హద్దులేదా?
Wednesday, January 15, 2025