పెండింగ్ బిల్లులే ప్రభుత్వానికి ఉరితాళ్లు!

Wednesday, January 15, 2025

చాలామంది కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులు చేయడానికి ఉత్సాహంగా ముందుకు వస్తారు. ప్రభుత్వ పనులైతే నాణ్యత కొంచెం అటుఇటుగా చేసినా సరిపోతుంది. కొంచెం లంచాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది గానీ.. బిల్లులు ముందు వెనుకగా అయినా సరే.. గ్యారంటీగా వచ్చేస్తాయి. నష్టం ఉండదు.. ఇలా ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. ‘ముందు వెనుకగా అయినాసరే గ్యారంటీగా వస్తాయి’.. అని అనుకునే బిల్లులు ఏళ్లతరబడి పెండింగులో పడిపోతే పరిస్థితి ఏమిటి? రావాల్సిన బిల్లుల మొత్తానికి వడ్డీలు ఎంతవుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో మార్జిన్లు బాగానే ఉంటాయని అనుకున్నప్పటికీ.. ఆ మార్జిన్లను కూడా మింగేసేంత వడ్డీల భారం పెరిగిపోతోంటే.. సదరు కాంట్రాక్టర్లు ఏం చేయాలి.
అనివార్యమైన పరిస్థితుల్లో కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కానీ చాలా పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్లు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కోర్టుల్లో బిల్లుల చెల్లింపుకోసం దాఖలవుతున్న కేసులే ఎక్కువైపోతున్నాయి.కోర్టులకే చిరాకు పుడుతోంది. ఈ కేసుల విచారణ సందర్భంగా.. ఆయా శాఖల అధిపతులను ఏకంగా కోర్టుకు పిలిపించడం, న్యాయమూర్తులు మందలించడం రివాజుగా మారిపోతోంది. తాజాగా కోర్టులు బిల్లుల చెల్లింపు విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశాయి. బిల్లుల చెల్లింపు సకాలంలో జరగక ఓ కాంట్రాక్టరు మేనత్త ఇంట్లో చోరీకి పాల్పడినట్టు కూడా పేపర్లలో వార్తలు చూశాం అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని అంటుంటుంది. మాకంటె పాత ప్రభుత్వమే ఎక్కువ అప్పులు చేసిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటారు. మరి అలాటప్పుడు బిల్లులు ఎందుకు చెల్లంచరో తెలియదు. తెలుగుదేశం హయాంలో చేసిన పనులకు బిల్లులు పెండింగ్ పెట్టేయడం అనేది ఒక రకం. వారంతా తెలుగుదేశం వారై ఉంటారని, వారిని వేధించాలనే ఉద్దేశం ఉంటే ఉండొచ్చు. అయితే వైసీపీ ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టులు చేసిన వారి పార్టీ నేతలకు కూడా బిల్లులు రావడం లేదు. తమ సొంత పార్టీ ప్రభుత్వాన్ని గట్టిగా నిందించలేరు.. అలాగని బిల్లులు రాకపోతే మనుగడ సాగించలేరు.. సతమతం అవుతున్నారు. ఇతర కాంట్రాక్టర్లు కొందరు కోర్టును ఆశ్రయించినప్పుడు రచ్చ అవుతోంది.
బిల్లులు చెల్లించకుండా అధికారులు సాకులు చెబుతున్నారని, కోర్టుకు వస్తే తప్ప బిల్లులు రావడం లేదని హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్లను దొంగలుగా చేస్తున్నారు. రిటైరైన పెన్షనర్లకు సకాలంలో పెన్షన్లు చెల్లించకుండా వారిని పిక్ పాకెటర్లుగా మారుస్తారా? అంటూ కోర్టు తీవ్రవ్యాఖ్యలు చేయడం విశేషం.
కాంట్రాక్టర్లు – బిల్లులు అనేది కొందరికి సంబంధించిన వ్యవహారమే అయినప్పటికీ.. ఆ ప్రభావం ప్రజల్లో చాలామంది మీద ఉంటుంది. బిల్లులు రాకపోవడం పుణ్యమాని అనేక చోట్ల మొదలుపెట్టిన పనులు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలే.. పనులు ఆగిపోతున్నాయని ఆగ్రహిస్తున్నారు. ఇదంతా బిల్లులు రాకపోవడం పుణ్యమే అని అందరికీ తెలుసు. ఇలాంటి వాతావరణంలో.. కాంట్రాక్టర్లకు చెల్లించుకుండా పెండింగులో పెడుతున్న బిల్లులే, ప్రభుత్వానికి ఉరితాళ్లుగా మారే ప్రమాదం ఉన్నదని కూడా ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles