‘పృష్ట తాడనాత్ దంత భంగః’ అంటే ఇదే!

Wednesday, December 18, 2024

ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉండనే ఉంటుందని ఫిజిక్స్ ఎనిమిదో క్లాసు చదువుకున్న వారందరికీ తెలుసు. అయితే ఎక్కడో ఒక చర్య జరిగితే.. దాని ప్రతిచర్య మరెక్కడో బయటపడుతుందనే సంగతి ఏమీ చదువుకోకపోయినా సరే.. అనుభవమ్మీద మనకు బోధపడుతుంది. ఇలాంటి దానినే, వీపు మీద తంతే మూతి పండ్లు రాలుతాయన్నట్టుగా.. పృష్ణ తాడనాత్ దంత భంగః అని సంస్కృతంలో చెప్తారు. ఇప్పుడు ఏపీ రాజకీయ వ్యవహారాల్లో ఒక విషయం గమనిస్తే ఈ సామెత నిజమవుతుందేమో అనిపిస్తోంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం ఇప్పుడు అనేక రకాల మలుపులు తిరుగుతోంది. వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర గురించి బహుధా చర్చ జరుగుతోంది. ఇప్పటికే అవినాష్ తండ్రి భాస్కర రెడ్డి అరెస్టు అయి ఉన్నారు. నేడో రేపో అవినాష్ అరెస్టు జరుగుతుందనే ప్రచారం కూడా ముమ్మరంగా ఉంది. అయితే ఈ పరిణామాలు వైఎస్ కుటుంబం చుట్టూ, ఆ హత్య కేసులో నిందితుల చుట్టూ తిరగడం వరకు ఓకే గానీ, ఏమాత్రం సంబంధంలేని మరో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టే వాతావరణం కనిపిస్తోంది.
సంగతేంటంటే.. అవినాష్ రెడ్డి నిందితుడని తేలితే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గతంలో ప్రకటించారు. ఇప్పుడు దర్యాప్తు కు సంబంధించిన వేళ్లన్నీ అవినాష్ వైపు చూపిస్తూ ఉండే సరికి ఆయనకు తన భవిష్యత్తు గురించి కంగారు పుట్టినట్టుంది. అందుకే.. ‘నిందితుడి గా చేరిస్తే రాజీనామా చేస్తానని నేను చెప్పలేదు. న్యాయస్థానంలో ఆ విషయం రుజువైతే మాత్రమే రాజీనామా చేస్తానని చెప్పాను.. ఆ మాటకు కట్టుబడి ఉన్నాను’ అంటున్నారు. అరెస్టు అయినా సరే.. అది పెద్ద విషయం కాదంటున్నారు. ‘రెస్టు తప్పదు. అయితే బెయిల్ కూడా వస్తుంది. ఇదంతా చంద్రబాబు వెనుకనుంచి నడిపిస్తున్న కుట్ర’ అని అభివర్ణిస్తున్నారు.
వాతావరణం అవినాష్ పాత్రను తేల్చేలాగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు. అదే జరిగితే గనుక.. నిండా నలభయ్యేళ్ల వయసు కూడా లేని అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోతుంది. నేరంతో ముడిపడ్డాక అలా జరిగినా అర్థం చేసుకోవచ్చు. కానీ తమ పార్టీ పెద్దల మనసులను దోచుకునేందుకు ఆవేశానికి పోయి ప్రతిజ్ఞలు చేసిన రాచమల్లు భవిష్యత్తు కూడా అంతరించి పోతే, అది కామెడీగా ఉంటుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles