తనకు సంబంధం లేని వ్యవహారంలో అనవసరంగా తలదూర్చి.. అంతో ఇంతో ఉన్న పరువును కూడా కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పోగొట్టుకున్నారనే అభిప్రాయం ఇప్పుడు ఆ సామాజికవర్గంలోనే వ్యక్తం అవుతోంది. ముద్రగడ అనుయాయుల్లో తప్ప ఇప్పుడు కాపు వర్గంలో ఆయన వెంట నిలుస్తున్న వారు లేరు. వైఎస్సార్ కాంగ్రెస్ లోని కాపులు బహిరంగంగా ఆయనను వెనకేసుకు రావడానికి ముందుకు రావడంలేదు. అదే సమయంలో తెలుగుదేశంలోని కాపులు ఓపెన్ గానే ముద్రగడ తీరుమీద నిప్పులు చెరుగుతున్నారు. పవన్ కల్యాణ్ పట్ల అభిమానంతో ఉండేవారు, తటస్థంగా కాపు నాయకులుగా చెలామణీ అవుతూ ఉండేవారు కూడా.. ముద్రగడను తప్పుపడుతున్నారు. దారిన పోయే కంపను తెచ్చి ఎక్కడో తగిలించుకున్నారనే సామెత చందంగా ముద్రగడ పరిస్థితి తయారైందని పలువురు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రలో భాగంగా.. కాకినాడలో సభ నిర్వహించినప్పుడు లోకల్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వను అన్నారు. దానికి కౌంటర్ గా ద్వారంపూడి కూడా.. దమ్ముంటే తనమీద పోటీచేసి గెలవాలని పవన్ కు సవాలు విసిరారు. వారిద్దరి మధ్య ఈ రాజకీయ వివాదంలోకి అనూహ్యంగా ముద్రగడపద్మనాభం రంగప్రవేశం చేశారు. ద్వారంపూడిని తిట్టినందుకు పవన్ మీద ముద్రగడ రెచ్చిపోయారు. పురాతన కాలంనుంచి పవన్ వ్యవహార సరళిని చెబుతున్న మాటలను అన్నింటినీ ప్రస్తావిస్తూ.. పవన్‌ను ఎద్దేవా చేయడానికి, నిందించడానికి ఆయన పూనుకున్నారు.
కాపు జాతిని ఉద్ధరించడం తర్వాత తన జీవితానికి మరో పరమలక్ష్యం ఏమీ లేదని పదేపదే చెప్పుకుంటూ, కాపుజాతికి తాను మెసయ్యలాంటి వాడిననే గుర్తింపు కోరుకునే ముద్రగడ పద్మనాభం.. ఎవరో రెడ్డి వర్గానికి చెందిన నాయకుడు, స్వతహాగానే విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడికి మద్దతుగా పవన్ కల్యాణ్ మీద విమర్శల దాడికి పూనుకోవడం చాలా మందికి చిరాకు పుట్టించింది. రాజకీయంగా పవన్ కల్యాణ్ కోసం హరిరామజోగయ్య లాంటి సీనియర్లు, తెలుగుదేశం తరఫున బుద్దా వెంకన్న లాంటి వాళ్లు ముద్రగడ మీద ప్రతివిమర్శలు చేశారు. సామాజిక వర్గం పరంగా కూడా కాపులందరూ ఇప్పుడు ఆయనను నిందిస్తున్నారు. ముద్రగడ తాను రాజకీయంగా వేసుకున్న ముసుగు ఈ లేఖతో తొలగిపోయిందని, తాను జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నట్టుగా తేటతెల్లం అయిందని కాపు ఐక్యవేదిక ఆయన మీద మండిపడింది. నిజానికి ముద్రగడ ఏనాడూ కాపుల సంక్షేమం కోసం పనిచేయలేదని, ప్రతి సందర్భంలోనూ తన వ్యక్తిగత రాజకీయ ఎజెండాల కోసం కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి వాడుకున్నారని ఐక్యవేదిక ఆరోపించింది. ఈ దెబ్బతో.. గతంలో ముద్రగడ కాపులకోసం పాటుపడినది ఏమైనా ఉంటే.. ఆ కృషి మొత్తం కూడా మంటగలిసిపోయినట్లయింది.
తాను మాట్లాడదలచుకున్నప్పుడు.. పేజీలకు పేజీలు కొనసాగే ఉత్తరాలతో విరుచుకుపడే అలవాటు ఉన్న ముద్రగడ పద్మనాభం.. ఇప్పుడు కాపులందరూ తనమీద చేస్తున్న మూకుమ్మడి దాడులకు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.